![]()
ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
- మోటర్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
- సభలో పాల్గొని ప్రసంగించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ఇల్లందు, మన భద్రాద్రి స్టాఫ్ రిపోర్టర్
ఆటో, మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆర్. జనార్ధన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లెందు పట్టణంలోని ఆటో, మోటార్ రంగ ఉద్యమ అమరవీరుల నగర్, అయితా ఫంక్షన్ హాల్, కామ్రేడ్ బట్టు శ్రీనివాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రగతిశీల ఆటో, మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఇఫ్టూ)తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ ప్రారంభోపన్యాసం చేశారు. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. వారు ప్రసంగిస్తూ ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని వాహనాలను నడుపుతున్న డ్రైవర్లకు ప్రభుత్వ చట్టాలు ఉరితాళ్లుగా మారాయని విమర్శించారు. ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడంలో పాలకులు ఘోరంగా వైఫల్యం చెందారని విమర్శించారు.
కరోనా కాలాన్ని అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని విమర్శించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పాత చట్టాల పేరుతో కొత్త చట్టాలు తీసుకువచ్చి నూతన మోటర్ వెహికల్ చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకువచ్చి డ్రైవర్స్ జీవితాన్ని ఉరితాడుగా మార్చిందని వారు అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది డ్రైవర్లుగా పనిచేస్తున్నారని, వారికి సంక్షేమ బోర్డు లేకపోవడం వలన అనారోగ్యాలకు గురై దుర్భర జీవితం గడుపుతున్నారని వారన్నారు. బ్యాంకు ఫైనాన్స్, ఆర్టీవో విచ్చలవిడి పన్నులు, టాక్స్ ల రూపంలో డ్రైవర్స్ పై ఆర్థికభారం మోపుతున్నారని, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన లైసెన్స్ ని సవరణల పేరుతో ప్రైవేట్ సంస్థలకి అప్పజెప్పి వ్యాపారం మొదలు పెట్టిందని, పాత పద్ధతిలోని లైసెన్సులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఆటో కార్మికులకు నెలకు 12,000 రూపాయలు జీవన భృతి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు రిటైరవుతున్నా వారి స్థానంలో మళ్ళీ భర్తీ చేసే పరిస్థితి లేదని, అలాగే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న కార్మికులను పర్మినెంట్ చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ శాసన సభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయుటకై అసెంబ్లీలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు మాట్లాడుతూ మోటర్ కార్మికుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, 2019 మోటార్ వెహికల్ యాక్ట్ వల్ల రోడ్డు ప్రమాదంలో యాదృచ్ఛికంగా ప్రమాదాలు మరణాలు జరిగినప్పుడు వాహన డ్రైవర్లు భయపడి అక్కడి నుండి వెళ్లిపోయినప్పుడు హిట్ అండ్ రన్ పేరుతో పది సంవత్సరాలు జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే దుర్మార్గమైన చర్యలకు మోడీ ప్రభుత్వం వడిగట్టిందని ఆయన అన్నారు.
టాక్స్ ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న రోడ్ల మరమ్మతులు చేపట్టే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవని, దీనితో రోడ్డు ప్రమాదంలో 2023 సర్వే ప్రకారం రోజుకి 1లక్ష 60 వేల యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కార్మికులంతా ఐక్యంగా తమ హక్కులను కాపాడుకోవాలని, ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి రాసుద్దీన్ పాల్గొని సాహర్థ సందేశం ఇచ్చారు. ఇంకా ఈ సభలు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి.ప్రసాద్, హెచ్.లింగ్య, తెలంగాణ ప్రగతి శీల గ్రామ పంచాయతీ వర్కర్స్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జటంగి వెంకన్న, మోటర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.మోహన్ రావు, మోత్కూరి మల్లికార్జునరావు ప్రసంగించారు. ఈ మహాసభకు అధ్యక్ష వర్గంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు, ఈ. నరేష్, బి.నాగేష్ వ్యవహరించారు. మహసభ ప్రారంభానికి ముందుగా ఐఎఫ్టియు జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడేటి నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఆటో, మోటార్ రంగ ఉద్యమ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం పాత బస్టాండ్ నుండి ఐఎఫ్టియు కార్యాలయం వరకు భారీ వర్షంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మోటార్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.మోహన్ రావు, మోత్కూరి మల్లికార్జున రావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరాటి వెంకటేశ్వర్లు, కొప్పుల శ్రీనివాస్, ఉప్పలయ్య, పల్లి సుధాకర్, వి.మల్లయ్య, డి.నూనెశ్వర రావు, ఎనగంటి రమేష్, అంజన్న, లంజపల్లి ధనంజయ, రామిశెట్టి నరసింహారావు, తొగర సామేలు, రాజు లోథ్, ఎన్నం నరసయ్య, రేసు కృష్ణ, రేసు అంజయ్య, సైదులు, గంగారపు కోటయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.


