![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెందూల్కర్ – అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా అయిదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఈ సిరీస్ 2-2తో భారత జట్టు డ్రా చేసుకోగలిగింది.
అయితే, మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రిషభ్‌పంత్ రివర్స్ స్వీప్ ఆడుతూ గాయపడ్డాడు. అప్పుడు బంతి బలంగా పంత్ పాదానికి తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. చివరికి గోల్ఫ్కార్ట్పై మైదానాన్ని వీడాడు. తర్వాత మరుసటి రోజు అతికష్టం మీద బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆఖరికి హాఫ్ సెంచరీ (54) చేసిన తర్వాత పెవిలియన్‌కు చేరాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు బ్యాటింగ్‌కు రాలేదు.
ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్.. టెస్ట్ క్రికెట్లో ‘ఇంజూరీ రిప్లేస్మెంట్స్’ ఉండేలా కొత్త నిబంధనలు రావాల్సిన అవసరం ఉందన్నాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (Ben Stokes) కొట్టి పడేశాడు. ఆ ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించాడు. అయితే ఓవల్‌లో జరిగిన అయిదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఆ టీమ్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాక తప్పలేదు. విజయానికి ఇంగ్లాండ్‌కు 20 పరుగులు అవసరమైన దశలో వోక్స్ ఒంటి చేత్తో బ్యాట్ పట్టుకుని ఆడటానికి వచ్చాడు.
ఈ విషయం గురించే రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. ”ఈ సిరీస్‌లో జరిగిన ఘటన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ‘కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. తక్షణమే బదులిస్తుంది’ అనే అర్థంలో తమిళ సామెత ఉంది. మనం ఏమి విత్తితే.. ఆ పంటనే కోస్తాం. నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ గాయం మీద విలేకరులు టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌ను ప్రశ్నలు అడిగారు. మ్యాచ్ మధ్యలో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో మరొకరిని తీసుకునే వెసులుబాటు ఉంటే బాగుంటుందని అతడు స్పందించాడు. ఈ విషయాన్ని వారు బెన్‌స్టోక్స్ దగ్గర ప్రస్తావించినప్పుడు. అతడు అదో హాస్యాస్పదమైన ప్రతిపాదన అని తోసిపుచ్చాడు. క్రికెట్లో బెన్‌స్టోక్స్ శక్తిసామర్థ్యాలకు నేను వ్యక్తిగతంగా పెద్ద అభిమానిని. కానీ.. అతడు సమాధానం చెప్పే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి’ అని అశ్విన్ చురకలంటించాడు.
అలాగే సబ్స్టిట్యూట్స్ విషయంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించాడు. ‘సబ్‌స్టిట్యూట్స్‌ను అనుమతించాలని మైఖేల్ వాన్ కూడా అన్నాడు. నేను ఏమి చెబుతున్నా అంటే.. ప్రత్యర్థి జట్టు మీద కాస్తైనా సానుభూతి చూపించాలి. రిషభ్ పంత్ స్థాయి శక్తిసామర్థ్యాలున్న ఆటగాడు ఇంగ్లాండ్ టీమ్ తరఫున ఆడుతూ గాయడితే జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో స్టోక్స్ ఓ సారి ఆలోచించాలి’ అని రవిచంద్రన్ అశ్విన్ కుండబద్దలు కొట్టాడు.


