Tuesday, March 24, 2026
HomeTelangana NewsBhadradri Kothagudemఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరి వ్యూహం వారిదే

ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎవరి వ్యూహం వారిదే

Loading

-గెలుపే లక్ష్యంగా తమదైన శైలీలో నిర్వహిస్తున్న సభలు

-ఇల్లందులో వేడెక్కనున్న ఎన్నికల వాతావరణం

-సోమవారం ఇల్లందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాక సభలు

-ఇల్లందులో సభకు కేటీఆర్ రాక

-సోమవారం బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రాక

-అదే రోజు ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సభ

-ఏర్పాట్లలో నిమగ్నమైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు

ఇల్లందు, మన భద్రాద్రి న్యూస్, మే 19

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో సోమవారం ఇల్లెందులో వాతావరణం వేడెక్కనుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఇల్లెందులో నిర్వహించే సభకు రానున్నారు. అదే రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కూడా సభను నిర్వహించనున్నారు. పట్టణంలోని జెకె సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో సింగరేణి స్కూల్ గ్రౌండును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం ఉదయం 10 గంటలకు జరుగు ఈ సభలో మాజీ మంత్రి కేటీఆర్ పట్టభద్రులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. సుమారు మూడు వేల మంది పట్టభద్రులను సమీకరించేందుకు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆదివారం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పట్టభద్రులను చైతన్యవంతులను చేసేందుకు సభ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు నెలల్లోనే హామీల అమలులో ఘోరంగా విఫలమైందని హరిప్రియ విమర్శించారు.
పట్టభద్రులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు పయనించే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పట్టభద్రులను సమీకరించేందుకు గ్రామగ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా సభను విజయవంతం చేయాలని పట్టబద్రులను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్, నియోజకవర్గంలోని టేకులపల్లి, గార్ల, బయ్యారం, కామేపల్లి, ఇల్లెందు మండలాల అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్, శీలం రమేష్, తాత గణేష్, ఆంతోటి అచ్చయ్య, కౌన్సిలర్లు పట్టణ బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సభ

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించే పట్టభద్రుల ముఖాముఖి సమావేశంలో తీన్మార్ మల్లన్న పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జెకె లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సభ ఏర్పాట్లను ఆ పార్టీ శ్రేణులు పర్యవేక్షిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం నిర్వహించే పట్టభద్రుల సమావేశానికి సుమారు రెండు వేల మందిని సమకరించేందుకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, నియోజకవర్గం ఎన్నికల ఇంఛార్జ్ మువ్వా విజయబాబు, తదితరులు ఈ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు డి డానియల్, మండల అధ్యక్షుడు పులి సైదులు తెలిపారు.

బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రాక

సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు కేవీ రంగా కిరణ్ పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షులు బూత్ సభ్యులు, కో – ఆర్డినేటర్స్ హాజరు కావాలని బీజేపీ నియోజక వర్గ ఇన్చార్జి బాలగాని గోపికృష్ణ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page