![]()
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతీ మాటనూ గుర్తుపెట్టుకొని మరీ టార్గెట్ చేస్తున్నారు APCC చీఫ్, సోదరి వైఎస్ షర్మిల. తాజాగా తిరుపతిలో వైఎస్ జగన్ చేసిన కామెంట్లను కాకినాడ జిల్లాలో ఘాటుగా తిప్పికొట్టారు షర్మిల.
“కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని, నా కుటుంబాన్నీ చీల్చింది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు జగన్ ఆన్న గారు” అంటూ సెటైర్ వేశారు షర్మిల. “దేవుడే గుణపాఠం చెప్తారట” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన షర్మిల.. “నిజానికి ఆంధ్ర రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉంది అంటే కారణం చంద్రబాబు, జగన్ ఆన్న గారే” అన్నారు. “ఇవాళ YSR కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ ఆన్న గారే. దీనికి సాక్ష్యం దేవుడు. దీనికి సాక్ష్యం నా తల్లి, వైఎస్సార్ భార్య విజయమ్మ. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం” అన్నారు షర్మిల.
“జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందిలో ఉంటే.. 18 మంది రాజీనామాలు చేసి జగన్ ఆన్న గారి వైపు నిలబడితే, అధికారంలో వచ్చాక మంత్రులను చేస్తా అన్నారు. ఇవాళ వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు? వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మ, నేను వాళ్ళ కోసం తిరిగాం. వాళ్ళ గెలుపు కోసం పాటు పడ్డాం. వాళ్ళను గెలిపించాం. వైసీపీ కష్టాల్లో ఉందని నన్ను పాదయాత్ర చేయమన్నారు. నా ఇంటిని, పిల్లలకు పక్కన పెట్టి… ఎండనకా, వాననకా రోడ్ల మీదనే ఉన్నా. ఆ తర్వాత సమైక్య యాత్ర కోసం అడిగితే ప్రజల బాగు కోసమే కదా అని ఆ యాత్ర కూడా చేశా. తెలంగాణలో కూడా ఓదార్పు యాత్ర చేశా. ఎప్పుడు అడిగితే, అప్పుడు మాట కూడా మాట్లాడకుండా అండగా నిలబడ్డా. ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూడకుండా, నిస్వార్థంగా ఏది అడిగితే అది చేశా. గత ఎన్నికల్లో బై బై బాబు అంటూ ఊరూరా తిరిగా. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ క్యాంపెయిన్ చేశా. వైసీపీని గెలిపించా. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు వేరే మనిషిలా మారిపోయారు” అని షర్మిల మండిపడ్డారు.
“నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు అనుకున్నాను. తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు.. YSR పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నా. ఈ 5 ఏళ్లలో ముఖ్యమంత్రితో సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారు. బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. అయినా ఏపిలో బీజేపీ, రాజ్యం ఏలుతుంది. జగన్ గారు ఆయన పార్టీనీ, రాష్ట్రాన్నీ, బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా అడగకుండా బానిస అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క రోజు హోదా అడగలేదు. రాష్ట్రంలో ఇప్పుడు హోదా ఆన్న అంశమే లేదు” అంటూ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు చెల్లి షర్మిల.


