![]()
- ఇండియా అథ్లెటిక్స్ క్యాంపుకు భద్రాచలం గిరిజన గురుకులం విద్యార్థిని
- భారత్ తరపున ప్రాతినిధ్యం వహించే ఛాన్స్
- పడిగే ఇందును అభినందించిన ఉన్నతాధికారులు
- సర్వత్రా వెల్లువెత్తుతున్న అభినందనలు
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదన్నది సామెత. ఈ విద్యార్థిని విషయంలో అదే జరిగింది. మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఈ గిరి బిడ్డ క్రీడల్లో విశేషంగా రాణించింది. ఏకంగా భారత కోచింగ్ క్యాంప్ కే సెలెక్ట్ అయింది. ఈ అరుదైన అవకాశం గిరిబిడ్డ పరమైంది. భద్రాచలం గిరిజన గురుకులం పిల్లలు చదువులోనే కాదు, క్రీడల్లో కూడా విశేషంగా రాణిస్తున్నారు. గతంలో అనేకమంది గిరిజన గురుకులం విద్యార్థినీలు వివిధ క్రీడాంశాల్లో జాతీయ స్థాయిలో తమ ప్రతిభాపాటవాలు చాటగా తాజాగా మరో విద్యార్థిని అథ్లెటిక్స్ లో విశేష నైపుణ్యం కనబరిచి భారత దేశ కోచింగ్ క్యాంపుకు ఎంపికవటం గమనార్హం. మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ అరుదైన అవకాశాన్ని గిరి బిడ్డ దక్కించుకోవటం పట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం పట్టణంలోని గిరిజన గురుకులంలో పడిగే ఇందు పదవ తరగతి చదువుతోంది. ఐదవ తరగతిలోనే ఈ గురుకులంలో చేరింది. చిన్నప్పటినుంచే క్రీడల పట్ల మక్కువ చూపిన ఈ విద్యార్థిని అనేక పోటీల్లో పాల్గొని తన క్రీడా ప్రతిభా పాటవాలు చాటింది. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్ లో పాల్గొని 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్క్ త్రో క్రీడాంశాల్లో తన సత్తా చాటింది. ఎన్.ఐ.డి.జే.ఏ. ఎం-24 కు కోచింగ్ క్యాంపుకు సెలెక్ట్ అయింది. భారతదేశంలో ఇటువంటి కోచింగ్ క్యాంపులు ఐదు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండగా, భోపాల్ కోచింగ్ క్యాంపుకు ఈ విద్యార్థిని సెలెక్ట్ కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ 14 విభాగంలో పడిగే ఇంద్ కు ఈ అవకాశం లభించింది. 15 రోజులపాటు సాధన ఈ కోచింగ్ క్యాంపుకు ఇందు బయలుదేరి భూపాల్ కు వెళ్ళింది. ఈ గిరిజన విద్యార్థిని చదువుతోపాటు ఆటల్లో కూడా చిన్నప్పటి నుంచి రాణిస్తోంది. హైదరాబాదులో జరిగిన ఈఎంఆర్ఎస్ జాతీయ క్రీడల్లో పడిగే ఇందు ఛాంపియన్ గా నిలవడం గమనార్హం. ఇంటర్ సొసైటీ లీగ్ (ఐఎస్ఎల్) క్రీడా పోటీలు కిన్నెరసాని, ఉట్నూరులో జరగగా ఈ విద్యార్థిని అండర్ 14 విభాగంలో ఇండివిడ్యువల్ ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. లక్ష్మీదేవి పల్లి గట్టుమల్లె గ్రామానికి చెందిన ఈ గిరిజన విద్యార్థిని తల్లిదండ్రులు సత్యనారాయణ, అనిత. వీరు గిరిజన వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, పడిగే ఇందు మొదటి కుమార్తె.
భారత కోచింగ్ క్యాంపుకు గిరిజన విద్యార్థిని ఎంపిక పట్ల సర్వత్రా అభినందనలు…
భద్రాచలం గిరిజన గురుకులంలో పదో తరగతి చదువుతున్న పడిగా ఇందు భూపాల్ లో నిర్వహిస్తున్న ఇండియా అథ్లెటిక్స్ కోచింగ్ క్యాంపుకు పడిగా ఇందు సెలెక్ట్ కావడం పట్ల సర్వత్ర అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ ఐఏఎస్, గిరిజన గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారి తుమికి వెంకటేశ్వరరాజు, స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్, భద్రాచలం గిరిజన గురుకులం ప్రిన్సిపాల్ ఎం దేవదాస్, గిరిజన గురుకులం సొసైటీ అధికారులు పడిగే ఇందును ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ కోచింగ్ క్యాంపులో రాణించి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని వారు ఆకాంక్షించారు.


