![]()
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, జూలై 03
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమర వీరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78 వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో గురువారం 4 న జరుగు సభను జయప్రదం చేయాలని బుధవారం మండలంలోని బద్దుతండాలో పోస్టర్లను ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి భూక్య హర్జ్య మాట్లాడుతూ నైజాం కాలంలో దేశముఖ్, భూస్వాములు, పటేల్, పట్వారిలు, జాగిర్దారుల నిరంకుషత్వ విధానాలను, వెట్టి చాకిరీని వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటాన్ని కొనసాగించరన్నారు. అనేకమంది ఈ పోరాటంలో అమరత్వం పొందారని, దీనిలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్యేనని కొనియాడారు. విస్నూరు రామచంద్రారెడ్డి తల్లి జానకమ్మ కడవెండి గ్రామంలో పేద ప్రజలతో వెట్టి చాకిరి చేయించుకుంటూ, అధిక వడ్డీలను వసూలు చేస్తూ, ప్రజలపై క్రూరంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ, ఆ గ్రామ ప్రజలు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో పోరాడారని, ఆ పోరాటంలో దొడ్డి కొమరయ్య ముందు భాగంలో ఉన్నాడని అన్నారు. ఆయన అమరత్వమే సాయుధ పోరాటానికి కీలకమైందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగంగా పోరాటమే నేటికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుందని, ఆ మార్గంలోని అర్థ వలస, అర్థ భూస్వామ్య విధానం కు వ్యతిరేకంగా నూతన ప్రజాస్వామిక విప్లవంను కొనసాగిస్తున్నామని అన్నారు. ఖమ్మంలో జరిగే దొడ్డి కొమురయ్య వర్ధంతి సభకు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకుాలీ సంఘం మండల కార్యదర్శి భూక్య నర్సింగ్, కిర్య, అమర్ సింగ్, జబ్బార్ లాల్, మీట్య, సురేష్, సీతా, హరిసింగ్, పడిత్య, భీక్య, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.


