![]()
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు
-ట్రాఫిక్ ఎస్సై నరేష్
కొత్తగూడెం, మన భద్రాద్రి న్యూస్, జూన్ 28
నంబరు ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్స్ వంచినా, అడ్డుగా స్టిక్కర్స్ వేసి వాహనదారులు తమ వాహనాలు నడిపితే సీజ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని శుక్రవారం కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్సై కె నరేష్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్, డీఎస్పీ అబ్దుల్ రహమాన్ ఆదేశాల మేరకు కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఎస్సై తమ సిబ్బందితో వాహనాల తనిఖీ చేపట్టి నంబరు ప్లేట్లు లేని పలు వాహనాలను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు ముందు, వెనక తప్పనిసరిగా నెంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు. నంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడపడం, స్టిక్కర్స్ వేయడం, వంచడం, ట్రిపుల్ రైడింగ్, సౌండ్ పొల్యూషన్ వంటివి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వాహనాలను గుర్తించి సీజ్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని లేకపోతే జరిమానాలు తప్పవన్నారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతినిత్యం వాహనాల తనిఖీతోపాటు, బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష పడుతుందన్నారు. ఈ తనిఖీలలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


