![]()
పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిపై కక్ష్యపూరింతంగా దాడులు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి శనివారం ఆయన పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రాష్ట్రంలో రాజ్యాంగ హననం జరుగుతున్నదని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తుంగలో తొక్కుతున్నదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సిటీ సెంటర్ లైబ్రరీలో ఉన్న విద్యార్థులను ఈడ్చుకొచ్చి అరెస్టులు చేశారని, నిరుద్యోగులపై దాడులు కేసులు పెట్టడం చూస్తుంటే హైదరాబాద్ లో భయానక వాతావరణం ఎలా ఉందో సూచిస్తున్నదన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని, అక్రమంగా పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుందన్నారు. తేదీలతో సహా పార్టీ మారిన ఎమ్మెల్యేల వివరాలను గవర్నర్ కు సమర్పించామన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్ పై పోటీ చేశారని గవర్నర్ కు వివరించామన్నారు. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పోటోకాల్ విషయంలో జరుగుతున్న అవమానాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తమ ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పినట్లు తెలిపారు.


