![]()
-ముంపు గ్రామాలకి దిక్కెవరు?
-గ్రామానికి మూడు వైపుల కరకట్టతో తీవ్ర ప్రమాదం
-బీఆర్ఎస్ నాయకులు కేవి రమణ
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో పోలవరం వెనుక జలాల ప్రభావం మరియు ఉపనదుల వరద ఉధృతి కారణంగా బూర్గంపహాడ్ మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో బూర్గంపహాడ్ గ్రామం పూర్తిగా మునిగిపోతుందని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు కేవి రమణ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని మరి కొన్ని గ్రామాలైన నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, సారపాక, మోతే తదితర గ్రామాలు తీవ్రమైన వరదముంపుని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు.
గోదావరి వరద ఉధృతి కారణంగా వ్యవసాయ పంటల మునకతో రైతులు, వ్యాపారస్థులు, కూలీలు, సామాన్యుల జన జీవనం స్తంభించి, దిక్కుతోచని పరిస్థితి దాపురిస్తుందని ప్రజలందరూ భయపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.
భద్రాచలం వైపు కరకట్ట నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదని, ఇది పూర్తయితే బూర్గంపహాడ్ మండలంలోని ముంపు గ్రామాలకు వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బూర్గంపహాడ్ మండల గ్రామ ప్రజలు సమిష్టిగా రాజకీయ పార్టీల జేఏసీ ఆధ్వర్యంలో 2022 ఆగస్టు 19 వ తేదీ నుండి మండలంలోని ముంపు గ్రామాలను పోలవరం ప్రాజెక్టు ముంపు బాధిత గ్రామాలుగా గుర్తించి, 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి, పరిహారం అందించాలని 53 రోజులు నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. అప్పుడు ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరాహార దీక్ష శిభిరాన్ని సందర్శించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని, ప్రస్తుతం వీరు తెలంగాణ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు కాబట్టి మా మండలంలోని ముంపు గ్రామాల సమస్యకు సత్వర శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. త్వరలో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల ముంపు సమస్య పరిష్కారం కోరుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. ముంపు సమస్య దృష్ట్యా గత కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మండలి, తెలంగాణ జల వనరుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీలతో సంయుక్త కమిటీని నియమించి తెలంగాణ రాష్ట్రంలో ముంపు తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నం జరిగిందని, పత్రికలో వచ్చిన సమాచారం మేరకు ఆ నివేదికలు క్షేత్రస్థాయిలో ముంపు తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైందని ప్రజలు బాహాటంగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. జూలై 6 వ తేదిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల పరిష్కారం దిశగా జరుగు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని పోలవరం కారణంగా ముంపును ఎదుర్కొంటున్న గ్రామాలకు శాశ్వత పరిష్కారంలో భాగంగా తెలంగాణలోని ముంపు గ్రామాలకు 2013 భూ సేకరణ చట్టాన్ని అనుసరించి పరిహారం అందించే విధంగా చర్చలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు.


