Monday, March 23, 2026
HomeInternationalభారత్ పై ట్రంప్ మరో పిడుగు- ఫార్మాపై 100% టారిఫ్: 1 నుంచి అమలు

భారత్ పై ట్రంప్ మరో పిడుగు- ఫార్మాపై 100% టారిఫ్: 1 నుంచి అమలు

Loading

మన భద్రాద్రి వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఫార్మాసూటికల్స్ పై వంద శాతం టారిఫ్ విధించారు. కొత్త టారిఫ్ అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

అమెరికాకు ఎగుమతి చేసే బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల దిగుమతులపై 100 శాతం టారిఫ్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం భారతీయ డ్రగ్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు డొనాల్డ్ ట్రంప్. రష్యాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది.

దీనికి అదనంగా ఇప్పుడు మళ్లీ ఫార్మా రంగంపై 100 శాతం టారిఫ్ విధించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. అక్టోబర్ 1 నుండి, బ్రాండెడ్ లేదా పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 100% టారిఫ్ అమలు చేయనున్నామని, డ్రగ్ కంపెనీలు తమ తయారీ ప్లాంట్‌ను అమెరికాలో నిర్మిస్తే దీనికి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ‘నిర్మిస్తోంది’ అంటే ‘నిర్మాణం ప్రారంభించడం’ లేదా ‘నిర్మాణంలో ఉండటం’ అని అర్థం” అని ఆయన స్పష్టం చేశారు.

ఫార్మా రంగం మాత్రమే కాకుండా, ఇతర ఉత్పత్తులపైనా ట్రంప్ సుంకాలను ప్రకటించారు. కిచెన్ క్యాబినెట్లపై 50, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌- 30, భారీ ట్రక్కులు- 25 శాతం దిగుమతి పన్నులు ఉంటాయని తెలిపారు. అమెరికాలోని పీటర్‌బిల్ట్, కెన్‌వర్త్, ఫ్రైట్‌లైనర్, మాక్ ట్రక్స్ వంటి తయారీదారులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జాతీయ భద్రత ప్రయోజనాలు, ఇతర అనేక కారణాల వల్ల ట్రక్కులపై టారిఫ్ విధించానని తెలిపారు.

భారత్ కు అమెరికా అతిపెద్ద విదేశీ మార్కెట్. 2025 తొలి ఆరు నెలల్లో 32,505 కోట్ల రూపాయల మేర ఫార్మా ఎగుమతులు నమోదయ్యాయి. ఇది అంతకుముందు సంవత్సరం తో పోల్చుకుంటే 21 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరంలో 8.1 బిలియన్ డాలర్ల మేర ఫార్మా ఎగుమతులు నమోదయ్యాయి. దేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 40 శాతం ఉందంటే.. ఈ రంగంలో భారత్ కు ఆ దేశం ఎంత పెద్ద మార్కెట్ అనేది అర్థం చేసుకోవచ్చు.

డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లూపిన్, అరబిందో వంటి కంపెనీలు అమెరికా మార్కెట్‌పై ఆధారపడి తక్కువ ధరల జనరిక్ ఔషధాలతో లబ్ధి పొందుతున్నాయి. ట్రంప్ టారిఫ్ వల్ల ప్రధానంగా బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాపై దృష్టి సారించినప్పటికీ, దేశం నుండి వచ్చే కాంప్లెక్స్ జనరిక్స్, స్పెషాలిటీ డ్రగ్స్ పై కూడా దీని ప్రభావం ఉండవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page