![]()
న్యూఢిల్లీ, మన భద్రాద్రి వెబ్ డెస్క్
ఏపీలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన కూటమికి ప్రజలు పట్టం గట్టారు. అలాగే ఈ కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఈ ఐదేళ్లలో ఆశించిన ప్రయోజనం అందుతుందా లేక గత పదేళ్ల తరహాలోనే ఈసారి కూడా బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాలకు ఆంధ్రాను వాడుకుని వదిలేస్తుందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇదే నిజమనిపించేలా ఉంది.
అసలు విషయానికొస్తే.. రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన కూటమి సర్కార్ కేంద్రం నుంచి భారీగా నిధులు, ప్రాజెక్టులు, ఇతరత్రా సాయం ఆశిస్తోంది. జనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్రం సాయం చేయాలని కోరుకుంటోంది. ఇందుకోసం సీఎం చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎంపీల్ని, మంత్రుల్ని కేంద్ర మంత్రులకు లింక్ చేసి ఆయా శాఖల నిధులు రాబట్టుకోవాలని ఆదేశించారు. దీంతో వారు కేంద్ర మంత్రుల్ని, ప్రధాని మోడీని కలుస్తున్నారు. అక్కడ వారికి షాకులు తప్పడం లేదు.
సీఎం చంద్రబాబు కేంద్రమంత్రుల్ని కలిసి రాష్ట్రానికి నిధులు కోరుకుంటే వారు గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై తమకు అందిన ఫిర్యాదుల్ని చూపిస్తున్నారని టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని వెల్లడించారు. ఇదంతా జగన్ ప్రభుత్వం నిర్వాకమే అని మండిపడ్డారు. చంద్రబాబు శ్వేతపత్రాల విడుదలపైనా అమిత్ షా స్పందించారన్నారు. ఈ స్ధాయిలో అవినీతి జరుగుతుంటే ఇక నిధులేం ఇస్తాం అన్నది వీరి రియాక్షన్ గా కనిపిస్తోంది.
గతంలో పలు సాకులు చూపి ఏపీకి రావాల్సిన విభజన హామీలతో పాటు నిధుల్నీ కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నిరాకరించింది. దీనిపైనే జగన్ క్షేత్రస్ధాయిలో పోరాటం చేసి ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీల్ని కేంద్రం మెడలు వంచి సాధిస్తానంటూ ఓట్లు వేయించుకున్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో జగన్ సైతం జనం విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు కూటమి వంతు వచ్చింది. కేంద్రమంత్రుల నుంచి అందుతున్న వినతులపై సానుకూలంగా స్పందించకుండా కేంద్రం ఇలా జగన్ పాలనను సాకుగా చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


