![]()
- గిరిజనులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలి
- గిరిజన గ్రామాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలి
- ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్
భద్రాచలం, మన భద్రాద్రి బ్యూరో
గిరిజన గ్రామాలలో వర్షాకాలం పరిస్థితుల దృష్ట్యా డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతున్నందున సంబంధిత వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి గిరిజనులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని, అలాగే గ్రామాలలో నీరు నిలువ ఉండకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత గ్రామ పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. శనివారం నాడు చర్ల మండలం లోని సత్యనారాయణపురం లో ఇంటింటికి తిరిగి శానిటేషన్ కి సంబంధించిన పనులను ఆయన పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటి ముందు మరియు వీధులలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, మురికి నీరు నిలువ ఉండుట వలన దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వ్యాధులు విజృంభిస్తాయని, అందుకు సంబంధిత పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటి ముందు పాత టైర్లు గాని, కూలర్లు కానీ, తొట్టిలలో నీరు నిలువ ఉండకుండా ఎప్పటికప్పుడు పారబోసేలా ప్రజలకు తెలియజేయాలని, అలాగే వీధులలో మరియు ఇంటి లోపల దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్, స్ప్రే చల్లించాలని అన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి ముందు నీరు నిలువ ఉండే వస్తువులు ఏవి ఉంచకూడదని, ఆరుబయట నీరు నిల్వ ఉన్నచోట వెంటనే పంచాయతీ సిబ్బందికి తెలియజేసి దోమల మందు పిచికారి చేయించాలని, అలాగే కాచి వడపోసిన నీటిని తాగాలని అన్నారు. అనంతరం కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యశాలలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలుతున్న వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో డిఎం హెచ్ఓ కు ఫోన్ ద్వారా సంప్రదించి కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది పనితీరు బాగాలేదని డెంగ్యూ, మలేరియా కేసులు అధికంగా ప్రబలుతున్న మరియు ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు కూడా సరైన వైద్యం అందడం లేదని సిబ్బందిపై శాఖ పరమైన చర్య తీసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం డెంగ్యూ వ్యాధి సోకిన పేషంట్ల ఇంటికి వెళ్లి సరైన వైద్య పరీక్షలు చేయించుకోని, క్రమం తప్పకుండా మందులు వాడాలని అలాగే ఇంటి బయట ఇంటి లోపల దోమల మందు పిచికారి చేయించుకోవాలని ఆయన వారికి సూచించారు. సంబంధిత వైద్య సిబ్బంది డెంగ్యూ వ్యాధి ప్రబలిన గ్రామాలలో ప్రతి ఇంటికి దోమల మందు పిచికారి మరియు ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు చేసి డెంగ్యూ, మలేరియా వ్యాధి నిర్ధారణ అయితే వారికి ప్రత్యేక వైద్య చికిత్సలు చేయాలని అన్నారు. సంబంధిత జిల్లా వైద్యాధికారి సమస్యత్మక మండలాలు గ్రామాలలో తప్పనిసరిగా దోమల మందు పిచికారి మరియు క్లోరినేషన్ చేయించాలని అన్నారు. విధి నిర్వహణలో అశ్రద్ధ వహించిన జూనియర్ పంచాయతీ సెక్రెటరీ ఉదయ్ కుమార్ కి శోకజ్ నోటీసు జారీ చేయాలని డిపిఓ కి ఆదేశించారు. అనంతరం కత్తి గూడెం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బోధిస్తున్న మూల్యాంకమును పరిశీలించి పిల్లల చేత అక్షరాలు రాయించి మూడో తరగతి, నాలుగో తరగతి, ఐదవ తరగతి పిల్లలకు వారికి అర్థమయ్యే రీతిలో అక్షరాలు నేర్పించాలని, లెక్కలు కూడా చెప్పాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. అనంతరం పిల్లలను మూల్యాంకములో వారి యొక్క నైపుణ్యాలను పరీక్షించి వారికి పెన్నులు, నోట్ బుక్కులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో చర్ల ఎంపీడీవో ఈదయ్య, ఎంపీ ఓఎస్కే వలి, సిడిపిఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు.


