Tuesday, March 24, 2026
HomeSports Newsసన్ రైజర్స్ హైదరాబాద్ శుభారంభం..!

సన్ రైజర్స్ హైదరాబాద్ శుభారంభం..!

Loading

సన్ రైజర్స్ హైదరాబాద్ శుభారంభం..!

  • రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో, మార్చి 23

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం చేసింది. గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తూ విధ్వంసకర బ్యాటింగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. ఆదివారం ఉప్పల్ వేదికగా సిక్సర్ల వర్షం కురిసిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ పరుగుల విధ్వంసంతో ఈ మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. నితీష్ కుమార్ రెడ్డి(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 30), హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34)దూకుడుగా ఆడారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తీక్షణ(2/52) రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే(3/38) మూడు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మ(1/51) ఒక వికెట్ తీసాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో మొత్తం 34 ఫోర్లు, 12 సిక్సర్లు నమోదయ్యాయి.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇంపాక్ట్ ప్లేయర్ సంజూ శాంసన్(37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 66), ధ్రువ్ జురెల్(35 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. చివర్లో షిమ్రాన్ హెట్‌మైర్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42), శుభమ్ దూబే(11 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 34 నాటౌట్) దూకుడుగా ఆడినా.. చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో ఏం చేయలేకపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో సిమర్జిత్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, ఆడమ్ జంపా తలో వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 18 సిక్సర్లు నమోదయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page