![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఝార్ఖండ్ లోని ఓ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది భారీగా నగదు గుర్తించారు. సింగ్‌భమ్ జిల్లాలోని నక్సల్ ప్రభావిత కారైకేలా ప్రాంతంలో బంకర్‌లాంటి ఓ నిర్మాణంలో రూ.35లక్షలు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
పక్కా సమాచారం మేరకు సీఆర్‌పీఎఫ్, ఝార్ఖండ్ జాగ్వార్, జిల్లా సాయుధ పోలీసులు సారండా అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ చేపట్టగా.. ఆ సమయంలో అనుకోకుండా బంకర్ లాంటి నిర్మాణాన్ని గుర్తించారు. అనంతరం దాన్ని తవ్వి చూడగా రెండు స్టీల్ డబ్బాల్లో రూ.34.99 లక్షల నగదు ఉంది. ఆ మొత్తాన్ని సీజ్ చేసినట్లు ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. వీటిని మావోయిస్టులు దాచి ఉంటారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ డబ్బును ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాల కొనుగోలు కోసం ఉంచినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు.


