![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యల కోసం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షం కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు కొండాపూర్ పరిధిలోని ఖానామెట్‌లోనూ పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ కావడంతో రద్దీని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


