![]()
-డీఎస్పీ చంద్రభాను
గుండాల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 20
శెట్టుపల్లి, చెంభునిగూడెం గ్రామాలను గురువారం ఇల్లందు డీఎస్పీ చంద్రభాను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థులు ఎవరూ కూడా అసాంఘిక శక్తులకు సహకరించవద్దని కోరారు. సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా పిల్లలను మంచిగా చదివించాలని, వారిని ప్రయోజకులను చేయాలని తెలిపారు. ఈమధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కావున బ్యాంకు వివరాలు అపరిచిత వ్యక్తులకు గానీ, ఫోన్ కాల్స్ చేసి వివరాలు అడిగినవారికి గానీ చెప్పి మోసపోవద్దని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవటం వల్ల, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని, లైసెన్స్ ఉన్న దుకాణలలో మాత్రమే విత్తనాలు కొనాలని, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. యువత గంజాయి వంటి మత్తు పదార్దాలకు అలవాటుపడి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. ఈ అవగాహనా కార్యక్రమంలో గుండాల సీఐ రవీందర్, కొమరారం ఎస్సై సోమేశ్వర్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


