![]()
అసైన్డ్ భూములకు హక్కులు కల్పించండి
- మంత్రి పొంగులేటిని కోరిన అసైన్డ్ భూముల శాశ్వత హక్కుల సాధన సమితి
హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో,
తెలంగాణలో రైతులకు అసైన్ చేసిన 20 ఏండ్లకైనా శాశ్వత హక్కులు కల్పించాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అసైన్డ్ భూముల శాశ్వత హక్కుల సాధన సమితి కోరింది. బుధవారం సచివాలయంలో మంత్రిని సమితి ప్రధాన కార్యదర్శి మన్నె నర్సింహారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల రైతు కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా లభిస్తుందన్నారు.
ఎప్పుడైనా అత్యవసరానికి, పిల్లల చదువు, పెళ్లిళ్లకు అమ్ముకునే వీల్లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించినట్లుగా పూర్తి హక్కులు కల్పించాలని కోరారు. పీవోటీ, 1977 కి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 20 ఏండ్లకు, కర్నాటకలో 15 ఏండ్లకు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్రాష్ట్రాల్లో పదేండ్లకు శాశ్వత హక్కులు కల్పిస్తున్నట్లు వినతిపత్రం లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల భూమిని పేదలకు అసైన్ చేశారని, వారందరూ అభద్రతా భావంతో ఉన్నారని చెప్పారు. వీరిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలేనని గుర్తు చేశారు.


