![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో ప్రారంభమైన ఈ యుద్ధం ఆ తర్వాత క్రమంగా ముదురుతోంది. తొలుత ఇరాన్ లోని అణు శాస్త్రవేత్తలే లక్ష్యంగా ప్రారంభించిన ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ విస్తరిస్తూ పోవడంతో ఇరాన్ కూడా అంతే దీటుగా బదులిస్తోంది.
ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కూడా పనిచేయడం లేదు. దీంతో ఇరాన్ పై దాడి చేయాలా వద్దా అనే దానిపై అమెరికా కూడా మల్లగుల్లాలు పడుతోంది.తాజాగా ఇజ్రాయెల్ లోని నిఘా సంస్ధ మొస్సాద్ కేంద్ర కార్యాలయం, స్టాక్ ఎక్చేంజ్ లపై దాడులు చేసిన ఇరాన్ నిన్న సోరోకా ఆస్పత్రిపైనా దాడులకు దిగింది. అనంతరం దక్షిణ ఇజ్రాయెల్ లోని పలు ప్రాంతాలపై అత్యంత ప్రమాదకర క్లస్టర్ బాంబులతో దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రమాదకరమైన క్లస్టర్ బాంబులతో ఇరాన్ తమపై దాడులకు దిగడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఈ క్లస్టర్ బాంబులు ఎందుకంత ప్రమాదకరం అన్న చర్చ మొదలైంది.ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బాంబుల్లో ఈ క్లస్టర్ బాంబులు కూడా ఒకటి. వీటికి గాల్లోనే పేలిపోయి ఆ ముక్కలు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి విధ్వంసం కలిగించడం వీటి ప్రత్యేకత. ఈ బాంబుల్ని 2008లో ప్రపంచవ్యాప్తంగా 111 దేశాలు నిషేధించాయి. వీటిని వాడకూడదని, ఉత్పత్తి చేయకూడదని, రవాణా చేయకూడదని ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రం సంతకాలు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ తమ అస్త్రాన్ని బయటికి తీసింది.ఇవి చాలా భయంకరమైన ఆయుధాలని, ముఖ్యంగా పౌర జనాభా ఉన్న ప్రాంతంలో వీటిని ఉపయోగిస్తే అవి విస్తృత స్థాయిలో విధ్వంసం సృష్టించగలవని నిపుణులు చెప్తున్నారు. అలలాే ఘర్షణల నుండి మిగిలిపోయిన పేలని మందుగుండు సామగ్రికి ఇవి అదనంగా మారవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ క్లస్టర్ బాంబుల వాడకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ కు అమెరికా వీటిని ఇవ్వడం ఆ దేశం ప్రయోగించడం జరుగుతూనే ఉంది.


