![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఉచిత బస్సులో విధులు నిర్వహించాలంటే కండక్టర్ల, డ్రైవర్లు కత్తిమీదసాముగా మారింది. మహిళల రద్దీ విఫరీతంగా ఉండటంతో టికెట్లు ఇవ్వడం భారంగా మారింది.
పదవీ విరమణ దగ్గరలో ఉన్న కండక్టర్ల పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. దీనికి తోడు బస్సులో అడుగు పెట్టినప్పటి నుంచి చివరి స్టేజీ వరకు నిలబడటం తప్ప ఒక నిమిషం కూర్చునే పరిస్థితి లేదు. మహిళలతో సీట్లు నిండిపోతున్నాయి.
బస్సులోకి ఒకసారి జనం రావడంతో సీట్ల కోసం జరిగే తగదాలతో తాము దాడులకు గురికావాల్సిన వస్తోందని, బస్సు స్టేజీ వద్ద కొంచెం అటు ఇటు బస్పు నిలిపితే ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని మహిళలు నిలదీస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. చాలా మంది మహిళలు వెనుక డోర్నుంచి ఎక్కడంతో డ్రైవర్లకు పూర్తిగా కనిపించక బస్సు ముందుకు కదలడంతో చాలా మంది కింద పడి గాయాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఒక వేళ జరగరాని ఘటన జరిగితే తమ ఉద్యోగం ఊడిపోతుందని భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మినీ పల్లెవెలుగు, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులో, హైదరాబాద్ నగరంలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులో ఈ పథకం అమలవుతుంది. ఈ కేటగిరిలకు సంబంధించిన బస్సులు 7292 ఉన్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. వీటిలో నిత్యం దాదాపు 35 లక్షల మంది ప్రయాణిస్తారు. ఏడాదిన్నర కాలంలో 186.50 కోట్ల మంది మహిళలు రూ. 6222 కోట్ల విలువైన ఉచిత ప్రయాణం చేసినట్లు అధికారులు చెప్పారు.
వృద్ధులు, వికలాంగుల పట్ల నిర్లక్ష్యం
మహాలక్ష్మి సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు వెళ్లాలంటే వృద్ధులు, వికలాంగుల పరిస్థితి మరింత దారుణం. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలంటే బతిమిలాడే పరిస్థితి నెలకొంది. తమ బాధలు అర్థం చేసుకోవాలని కోరినా వినేవారే తప్ప పక్కకు జరిగి సీటు ఇచ్చే వారే లేరు. ఉచిత బస్సు తమకు బాధ కలిగిస్తోందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన వారంతా సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో బస్సు దొరకకుంటే మెట్రో రైళ్లో వెళ్లవచ్చు. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు వచ్చే వరకు ఎన్ని గంటలైనా ఎదురు చూడక తప్పదు. దీంతో మహిళల రద్దీతో ఆర్టీసీ ప్రయాణమంటే యుద్దంతో సమానమైంది.
కిక్కిరిస్తున్న బస్సులు..
ఉచిత ప్రయాణం బస్సు మొదటి స్టేజీ వద్దే జనంతో కిక్కిరిసి పోతోంది. దీంతో డ్రైవర్లు తరువాత స్టేజీ వద్ద నిలపకుండా వేగంగా వెళ్తున్నారు. రోడ్డుకు అడ్డంగా నిలబడితే తప్ప బస్సులు ఆగే పరిస్థితి లేదు. గతంలో ఎవరి సీట్లలో వారే కూర్చోవాలని హెచ్చరిస్తే భయపడే వారు. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టరు చెప్పినా వినే నాథుడే లేడు. ఉచిత బస్సులో విధుల చేయడం కంటే పదవి విరమణ ఉత్తమ మార్గమని కండక్టర్లు చర్చించుకుంటున్నారు.
ఆర్డినరీ కంటే డీలక్స్ వైపు మొగ్గు
యాజమాన్యం రోజుకు రూ. 5వేల కనెక్షన్ల టార్గెట్, ప్రయాణికుల గొడవలతో ఆర్డినరి విధులు నిర్వహించేందుకు విముఖత చూపుతూ డీలక్స్ బస్సులో డ్యూటీలు వేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. వాటిలో రోజుకు రూ. 10వేల నుంచి రూ. 12వేలు నగదు రావడంతో పాటు జనం రద్దీ వంటి సమస్యలు లేవు. ప్రశాంతంగా విధులు నిర్వహించవచ్చని డీలక్స్లో డ్యూటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది కండక్టర్లు ఆర్డినరీ బస్సు విధులకు కేటాయిస్తే ఆరోగ్య సమస్యలతో అప్పటికప్పడు సెలవులు పెడుతున్నారు. దీంతో ఆర్డినరి బస్సులు తగ్గించాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.


