![]()
-తమను వదిలి వెళ్లొద్దని కన్నీరు పెట్టుకున్న విద్యార్థులు
బూర్గంపహాడ్, మన భద్రాద్రి న్యూస్
మండలంలోని సోంపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 12 ఏళ్లుగా తేజావత్ మోహన్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రమోషన్ లో భాగంగా మండలంలోని మోరంపల్లి బంజరు హై స్కూల్ కి బదిలీ అయ్యారు. టీచర్ ప్రమోషన్ పై వెళ్తున్న సందర్భంగా విద్యార్థులంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్నేళ్లుగా తమకు ఎంతో ప్రేమగా అక్షరాలు నేర్పిన ఉపాధ్యాయుడిని తమని వదిలి వెళ్ళొద్దంటూ అంటు వేడుకుంటున్నారు. పిల్లలకు ప్రార్థన చేసేందుకు కూడా కనీసం స్థలము లేని పాఠశాలకు గ్రామస్థులతో పాఠశాల డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి, దాతల ద్వారా డొనేషన్లు వసూలు చేసి స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలములో పంచాక్షరయ్య, మరికొంత మంది దాతలచే కళావేదిక ఏర్పాటు చేయించి, సరస్వతి దేవి, గాంధీ విగ్రహ ఏర్పాటు చేపించారు. ఐటీసీ వారితో మాట్లాడి పాఠశాలకు కావలసిన కనీస సౌకర్యాలైన బెంచీలు, వంటగది, డైనింగ్ హాల్, ప్రహరీ గోడ నిర్మాణంతోపాటు మరుగుదొడ్ల పునర్నిర్మాణం, అదేవిధంగా డిజిటల్ తరగతుల నిర్వహణ కోసం ఏర్పాటు చేయించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి పిల్లలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, రకరకాల ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలతో పాఠశాల కళకళలాడే విధంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే స్వచ్ఛ విద్యాలయ అవార్డుతో పాటుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా ఆయన కైవసం చేసుకున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలాగా బోధనోపకరణలు తయారుచేసి, పాఠాలు చెప్పడమే కాక, తరగతి గదులను ఆకర్షణీయంగా తయారుచేసి బోధనను కొనసాగించేవారు. బాలల మంత్రి మండలి ఏర్పాటు చేసి, పాఠశాలలో పరిశుభ్రతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యార్థులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో కల్పించిన ప్రధానోపాధ్యాయులు మోహన్ పదోన్నతిపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొరంపల్లి బంజరు బదిలీపై వెళ్తున్నారు.
దళిత పిల్లల జీవితాన్ని మార్చిన ఓ ఉపాధ్యాయుడు
విద్యార్థి జీవితంలో గురువుకి ప్రత్యేక స్థానం ఉంటుందని, వారి ఎదుగుదలలో గురువు పాత్ర ఎనలేనిదని, విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో గురువులు, విద్యార్థులతో మమేకమవుతారని, వారితో ఆత్మీయ బంధం ఏర్పడుతుందని, తమకు ఎంతో ప్రేమతో పాటలు చెప్పే టీచర్ తమని వదిలి వెళుతుంటే ఆ చిన్న హృదయాల బాధ కన్నీటి ధారగా మారింది. తప్పకుండా ఆ ఉపాధ్యాయుడు ఉత్తమ గురువుగా చిరకాలం గుర్తుండిపోతారు.


