![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: భారత్ మిత్ర దేశమంటూనే.. 25శాతం సుంకంతో పాటు పెనాల్టీలు కూడా విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ టారిఫ్‌ల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలను అధికార వర్గాలు కొట్టిపడేశాయి. ఇరుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొంది.ట్రంప్ సుంకాలపై భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోదని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. మౌనమే సరైన సమాధానమని.. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని తెలిపాయి.
ట్రంప్ టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే, అధికార వర్గాలు దీన్ని కొట్టిపారేశాయి. తొలిగా అణు పరీక్షలు చేసినప్పుడు కూడా మనపై ఇలాంటి ఆంక్షలే విధించారని.. ఆ సమయంలో మనది చాలా చిన్న ఆర్థికవ్యవస్థ అని అన్నారు. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చర్చలు కొనసాగుతున్నాయని.. ఇరుదేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.
అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయని, భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని అటు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పార్లమెంటులో పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలు, చిన్న పరిశ్రమలు, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరుదేశాలపై ఆయన విరుచుకుపడ్డారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమన్నారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. ఇక, ఈ వ్యాఖ్యలను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సమర్థించారు. భారత ఆర్థికవ్యవస్థ పతనమైందని, అది ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తప్ప ప్రతిఒక్కరికీ తెలుసని ఎద్దేవా చేశారు.


