![]()
ఐదుగురు నకిలీ విలేఖరులను అరెస్టు చేసిన కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు
కొత్తగూడెం, మన భద్రాద్రి స్టాఫ్ రిపోర్టర్, జూలై 21
పట్టణంలో ఐదుగురు నకిలీ విలేఖరులను ఆదివారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జూలై 15 న కొత్తగూడెం సన్యాసిబస్తీలో దాసరి సాంబశివరావుకు దూరపు బంధువు అయిన దాసరి పూర్ణ అనే మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో తన భర్త కొట్టి చంపాడని, ఆ విషయంలో వారి కుటుంబ సభ్యులను అక్రమ సంబంధం వలన మర్డర్ చేసారని పేపర్ లో ప్రచురిస్తామని బెదిరించి వారి దగ్గర ఎలాగైనా డబ్బులు తీసుకోవాలని ఐదుగురు వ్యక్తులు ఆ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడ్డారని వన్ టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించారు. మృతురాలి కుమారుడైన కార్తిక్ కు శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేసి రిపోర్టర్ అని చెప్పి మీ తల్లి అక్రమ సంబంధాలు పెట్టుకున్నదని, అందుకే మీ నాన్న మీ తల్లిని చంపాడని పేపర్లో ఆ విషయాన్ని రాయకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని బెదిరించాడని వివరాలు తెలిపారు. ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేసి మా మనుషులు మీ ఇంటికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుతారని చెప్పి ఫోన్ పెట్టేశాడని, అదే రోజు రాత్రి సుమారు 9 గంటలకు దాసరి కార్తీక్ ఇంటి దగ్గరకు శ్రీనివాస్, దాసరి సాంబశివరావు, మరో ముగ్గురు వ్యక్తులు అయిన రమేష్, రాజేష్, గణేష్ లు వెళ్లి పత్రికా విలేకరులమని చెప్పి డబ్బుల కోసం బెదిరించారని విచారణలో తేలిందన్నారు. కానీ అతను డబ్బులు ఇవ్వకపోవడంతో వారు తిరిగొచ్చారని, అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయిదుగురిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
విలేఖరులమని బెదిరించిన వ్యక్తులైన శ్రీనగర్ కాలనీ 5 లైన్, లక్ష్మీదేవిపల్లికి చెందిన ఏలూరి రాజేష్ కుమార్, బర్లి ఫీట్ కు చెందిన దాసరి సాంబశివరావు(సాంబ), హౌసింగ్ బోర్డ్ కాలనీ, చుంచుపల్లి మండలానికి చెందిన గుంటూరు శ్రీనివాసరావు, మిలీనియం క్వార్టర్స్ రుద్రంపూర్ కు చెందిన మేకల రమేష్, మేదర బస్తీకి చెందిన బాధావత్ గణేష్ అను ఐదుగురుని అరెస్ట్ చేశామని వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం పట్టణంలో కొంతమంది వ్యక్తులు విలేఖరులమని చెబుతూ ఒక ముఠాగా ఏర్పడి సామాన్య ప్రజలను డబ్బుల కోసం వేధిస్తున్నారని, తమ దృష్టికి వస్తుందని, దీనివలన నిజాయితీగా విలేఖరులుగా పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తుందని వన్ టౌన్ సీఐ అన్నారు. ఎవరైనా విలేఖరులమని చెప్పి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.


