![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: ఐర్లాండ్ లో భారత పౌరులపై ఇటీవల భౌతిక దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆరేళ్ల చిన్నారి జాత్యహంకార దాడికి గురైంది. చిన్నారి ముఖంతో పాటు ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా కొందరు దుండగులు కొట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర ఆందోళన రేకేత్తిస్తుంది. అసలేం జరిగిందంటే..
భారత సంతతికి చెందిన బాధిత బాలిక కుటుంబం గత ఎనిమిదేళ్లుగా ఐర్లాండ్‌లో నివసిస్తున్నారు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న ఆమె కుటుంబం ఇటీవల ఐరిష్ పౌరసత్వం కూడా పొందింది. ఆమెకు ఆరేళ్ల చిన్నారితో పాటు 10 నెలల కొడుకు ఉన్నారు. ఆమె అక్కడి మీడియాతో జరిగిన ఘటన గురించి వెల్లడించారు. ఈనెల 4న తన కుమార్తె మరికొంతమందితో కలిసి ఇంటి బయట ఆడుకుంటుండగా ఇది జరిగిందన్నారు. 12-14 మధ్య వయసున్న కొంతమంది అబ్బాయిలు ఆమెపై దాడి చేశారని వెల్లడించారు. ”భారత్‌కు తిరిగి వెళ్లిపో” అంటూ జాత్యహంకార దూషణలు చేశారని వివరించారు.
ముఖంపై కొట్టడంతో పాటు ఆమె వ్యక్తిగత అవయవాలపై కూడా దాడి చేశారన్నారు. వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చిన ఆమె ఏడుస్తూ ఉండిపోయిందన్నారు. ఈ ఘటనతో తను చాలా భయపడిపోయిందన్నారు. తన కొడుకుకి ఇంట్లో ఆహారం తినిపిస్తుండగా ఇదంతా జరిగిందన్నారు. తమకు ఇక్కడ సురక్షితంగా అనిపించడం లేదని ఆమె వాపోయారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని, కుమార్తెపై దాడి జరగకుండా ఆపలేకపోయానని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఫిర్యాదు చేశానని, అయితే వారికి శిక్ష విధించడం కంటే కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరినట్లు ఆమె తెలిపారు.
ఇటీవల ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యహంకార దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. జులై 19న డబ్లిన్ శివారులోని తల్లాగ్ట్‌లో డాక్టర్ సంతోష్ యాదవ్ అనే భారత పౌరుడిపై కొందరు స్థానిక యువకులు జాత్యహంకార దూషణలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన ఐర్లాండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ ఘటన షాక్‌కు గురిచేసిందని ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేశ్ మిశ్రా అప్పట్లో స్పందించారు. మరోవైపు.. ఈ దాడుల నేపథ్యంలో ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం ఇటీవల కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రతికూల సమయాల్లో నిర్జన ప్రదేశాలకు వెళ్లొద్దని, భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


