![]()
ఆంధ్రప్రదేశ్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: దశాబ్దాల కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టం కడుతూ వస్తోన్న కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న అమానుష ఘటన అందరినీ కదిలించివేసింది. ఈ ఘటనపై పలువురు స్పందిస్తోన్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోన్నారు.80,000 రూపాయల అప్పు తీర్చలేదనే కారణంతో శిరిష అనే మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కుప్పం మండలం నారాయణపురంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక భార్య శిరీష, బిడ్డలను వదిలి వెళ్లిపోయాడు. శిరీష గ్రామంలోనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ అప్పులు తీరుస్తోన్నారు.సకాలంలో అప్పు చెల్లించలేదనే కారణంతో శిరీషను అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు మునికన్నప్ప. ఆమెను ఈడ్చుకొంటూ తీసుకెళ్లి తాడుతో చెట్టుకు కట్టివేశాడు. బ్రతిమిలాడినా వినకుండా చీర లాగేశాడని, తనను కొట్టారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. శిరీషతో ఫోన్ లో మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. ఇటువంటి అమానవీయ సంఘటనలను తాము ఎంతమాత్రం ఉపేక్షించబోమని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.ఆమె కుటుంబ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువు చెప్పిస్తామని అన్నారు. పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని ఈ సందర్భంగా శిరీషకు చంద్రబాబు సూచించారు. అయిదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.


