![]()
- ఆ నిధులు పక్కదారి పట్టించారు..
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: గిరిజన సంక్షేమ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్క దారి పట్టించిందని ఆరోపించారు.
ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు రోడ్లు బ్రిడ్జిలు అవసరమని.. కానీ గతంలో నిధులు పక్కదారి పట్టించడంతో గర్భిణుల ప్రసవవేదన వంటి వార్తలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. మంత్రి సీతక్క హైదరాబాద్‌లో ఇవాళ(సోమవారం) మీడియాతో మాట్లాడారు.
ఏ ప్రభుత్వమైనా నిధులను పక్కదారి పట్టించవద్దని సూచించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులను వారికి ఖర్చు చేయాలని కోరారు. కేటాయించిన నిధులను అదే అసెంబ్లీ నియోజకవర్గంలో, అదే జిల్లాలో సర్దుబాటు చేయాలి.. తప్ప మైదాన ప్రాంతాలకు తరలించవద్దని ఆకాంక్షించారు. సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తే ఏజెన్సీ ఏరియా వెనకబాటులోనే మగ్గిపోతుందని తెలిపారు.
అందుకే ఎస్టీలకు కేటాయించిన ప్రతి పైసా వారికి ఖర్చు చేయాలని సూచించారు. ఎస్టీల్లో ఎక్కువమందికి ఉండటానికి ఇండ్లు లేవని తెలిపారు. కాబట్టి ఎస్టీల ఇండ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలని డిమాండ్ ఉందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


