![]()
మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టెస్టులు, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత వారిద్దరూ వన్డేల్లో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అయితే ఇప్పటికే పూర్తిగా నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరో షాక్ ఇచ్చింది. 2027 ప్రపంచకప్ ఆడాలంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తప్పకుండా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఓ జాతీయ మీడియాలో కథనాలను ప్రచురిస్తుంది. వన్డే జట్టులో తామిద్దరూ ఆడాలంటే తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలంటూ సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. 2025 డిసెంబర్లో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ (దేశవాళీ వన్డే టోర్నీ)లో కోహ్లీ, రోహిత్ తప్పక పాల్గొనాలి. ఈ టోర్నీలో ఆడకపోతే టీమ్ఇండియాలోకి రావడానికి అవకాశాలు మూసుకుపోయినట్లే అని జాతీయ మీడియా కథనాల్లో వెల్లడిస్తుంది. ఇప్పటికే వీరిద్దరూ టెస్టులు, టీ20లకు దూరమవ్వడం వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ గణనీయంగా తగ్గనుంది. ఈ క్రమంలో వారిద్దరి ఫిట్నెస్, ఫామ్‌ను అంచనా కోసం దేశవాళీ క్రికెట్ తప్పనిసరి అని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే టీమ్ఇండియా మేనేజ్మెంట్లో ఒకరు మాట్లాడుతూ.. “2027 వరల్డ్ కప్ కోసం మేము రూపొందిస్తున్న ప్రణాళికల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు” చెప్పినట్టు ఓ ప్రముఖ పత్రిక నివేదించింది. అయితే ఇటీవలే జరిగిన ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాల్గొనేందుకు సిద్ధమైనా.. వారిద్దరినీ జట్టులో నుంచి తప్పిస్తున్నట్లు సెలక్టర్లు ముందే తెలియజేసిన తరుణంలో వారిద్దరూ టెస్టుల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ విజయవంతం అవ్వడం.. జట్టులో కుర్రాళ్లు నిలకడగా రాణిస్తుండటంతో వన్డే టీమ్‌లోనూ మార్పులకు ఇదే కీలకమైన సమయమని సెలక్టర్లు నమ్ముతున్నట్లు సమాచారం. శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లకు సారథిగా చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకి ఇదే చివరిది కానున్నట్లు అంచనా. ఈ క్రమంలో వారు దేశవాళీ క్రికెట్‌కు తిరిగి రావడం అసాధ్యమని వారు అభిప్రాయపడుతున్నారు.


