![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే చైనా సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్నేళ్లుగా హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించిన బీజింగ్..
తాజాగా విమానంతో పోటీ పడే ఓ సరికొత్త రైలును (China High Speed Train) పరిచయం చేసింది. గంటకు అత్యధికంగా 600 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించగల ఈ రైలును ఇటీవల ఓ కార్యక్రమంలో ఆవిష్కరించింది.
బీజింగ్‌లో జరిగిన 17వ మోడ్రన్ రైల్వేస్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో సరికొత్త మ్యాగ్లెవ్ మోడల్ రైలును చైనా (China) ప్రదర్శించింది. ఈ ట్రైన్ కేవలం 7 సెకన్లలోనే 600 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే బీజింగ్ నుంచి షాంఘై మధ్య ఉన్న 1200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 150 నిమిషాల్లో చేరుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి 5.30 గంటలు పడుతోంది.
మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు విమానాల వేగంతో పోటీపడగలదు. ఈ సాంకేతికత వ్యతిరేక అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకొని.. ట్రాక్ నుంచి రైలును పైకి లేపడానికి సాయపడుతుంది. అప్పుడు ఫ్రిక్షన్ తగ్గి రైలు నిశ్శబ్దంగా, వేగంగా వెళ్లగలుతుందని బీజింగ్ అధికారులు వెల్లడించారు. ఇది వినియోగంలోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో దీన్ని పరీక్షించారు. ఈ రైలు బరువు 1.1 టన్నులు. చూడటానికి చాలా నాజూగ్గా బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంది.
ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతిపెద్దది. గతేడాది చివరినాటికి మొత్తం 48వేల కిలోమీటర్లకు విస్తరించింది. ఈ ఏడాది దీన్ని 50వేల కిలోమీటర్లకు పెంచాలని బీజింగ్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు హైస్పీడ్ రైళ్ల అభివృద్ధిలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటికే సీఆర్450 బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. ఇది గంటకు 450 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించగలదు.


