![]()
- అక్రమ మళ్లింపుపై దృష్టి పెట్టాలి
- రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: గతేడాదితో పోలిస్తే ఈ వానాకాలం సీజన్‌లో 18 శాతం ఎక్కువ యూరియాను సరఫరా చేసినట్లు రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో కలిసి మంగళవారం వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని యూనిట్లు యూరియాను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మళ్లించే అవకాశం ఉందని, అలాంటి యూనిట్లను తనిఖీ చేయాలని క్షేత్రస్థాయి అధికారులను సురేంద్రమోహన్ ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ లేదా మళ్లింపులకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ (8977741771)కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. రైతులకు సకాలంలో యూరియా అందేలా చూడాలని, ఇందుకోసం వ్యవసాయ, సహకార శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఉదయం 8 గంటలకే తెరిచి ఉంచాలన్నారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా పూర్తిస్థాయిలో సరఫరా అయ్యేలా చూసేందుకు, వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి శివశంకర్ బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.


