![]()
టిపిటిఎఫ్ విద్యా వైజ్ఞానిక మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
టేకులపల్లి, మన భద్రాద్రి
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 12వ తేదీలలో ఖమ్మంలోని నయాబజార్ పాఠశాల ఆవరణలో జరిగే రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యాభిమానులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ కోరారు. బుధవారం టేకులపల్లి లోని జిహెచ్ఎస్ లో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, కేజీబీవీలో స్పెషల్ ఆఫీసర్ సంతు చేతుల మీదుగా జరిగిన రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విశిష్ట అతిథులుగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అతిధులుగా ప్రొఫెసర్ జగన్మోహన్ సింగ్, ప్రొఫెసర్ జి.హరగోపాల్, బుర్రా వెంకటేశం, ఏ.శ్రీదేవ సేన, వక్తలుగా బుర్రా రమేష్, ఏ.నరసింహారెడ్డి, ప్రొఫెసర్ సి.కాశీం, ప్రొఫెసర్ కోదండరాం, ఎన్.వేణుగోపాల్, చందనా చక్రవర్తి, పి.ప్రసాద్ హాజరవుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో కామన్ స్కూల్ విధానాన్ని తీసుకురావాలని, అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత పాలకులు ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించారని, కొఠారి కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 22 వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే వ్యక్తిగత ఖాతాలలో జమ చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు డిఎ లను వెంటనే విడుదల చేయాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై దృష్టి పెట్టి వెంటనే నిర్వహించాలని, జీవో 317 లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పౌజ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, సిపీఎస్ ను రద్దు చేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని, గిరిజన సంక్షేమ శాఖ మరియు కేజీబీవీ లలో పనిచేస్తున్న సిఆర్టిలను రెగ్యులర్ చేసి ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, గిరిజన సంక్షేమ శాఖ కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కరరావు, రమణ, ఉపాధ్యాయులు మోహన్ రావు, శ్రీనివాసరావు, లాలు, రవీందర్, సురేష్, శ్రీదేవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


