![]()
మన భద్రాద్రి వెబ్ డెస్క్: కుల సంఘాలు.. మహిళా, యువజన సంఘాల గురించి అందరికీ తెలుసు. కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రత్యేకంగా తాతల సంఘం ఉంది.
ఆ గ్రామంలో ఎవరైనా వారి తల్లిదండ్రులను వేధిస్తున్నారని తెలిస్తే ఆ తాతల సంఘం ఊరుకోదు. తమ సంతానం వేధించినట్లు ఆ సంఘంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే సభ్యులంతా వెళ్లి.. వారి కుమారుడు లేక కుమార్తెకు అలా చేయకూడదని అనునయంగా చెబుతారు. వినకపోతే పద్ధతి మార్చుకోమని సూచిస్తారు. మంకుపట్టుతో ఉంటే హెచ్చరిస్తారు. అయినా మారకుంటే వారి ఇంటి ముందే వంట చేసుకుని తింటూ నిరసన వ్యక్తంచేస్తారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మోతె గ్రామంలో వృద్ధులు తమ సమస్యల పరిష్కారానికి ఇలా ప్రత్యేకంగా తాతల సంఘాన్ని నిర్వహించుకుంటున్నారు.
తమ పిల్లలు వేధిస్తున్నారని, ఇంట్లోంచి వెళ్లగొట్టారని గ్రామానికి చెందిన వృద్ధులు గతంలో ఫిర్యాదు చేస్తుండేవారు. దీంతో 2010లో అప్పటి గ్రామ సర్పంచి గడ్డం రాజిరెడ్డి.. పలువురు పెద్ద మనుషులతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయించారు. అప్పటి నుంచి ఈ సంఘ సభ్యులు మోతె గ్రామంలోని వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘంలో 40 మంది వృద్ధులు సభ్యులుగా ఉన్నారు. దీన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. గత ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఈ సంఘానికి భవనం నిర్మించి ఇచ్చారు. ఈ సంఘం ఏర్పాటుతో గ్రామంలో వృద్ధులపై వేధింపుల సమస్యలు చాలావరకూ తగ్గాయని సభ్యులు చెప్పారు.


