Monday, March 23, 2026
HomeTelangana Newsతెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

Loading

మన భద్రాద్రి న్యూస్ బ్యూరో

రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, భూ లావాదేవీలను సమర్దవంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

కర్నాటక రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వేయర్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 5 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోబోతున్నామన్నారు. దీని కోసమే ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన వారిని ఎంపిక చేసి తెలంగాణ సర్వే శిక్షణా అకాడమిలో శిక్షణ ఇస్తామన్నారు. కర్నాటకలో అమలవుతున్న లైసెన్స్‌డ్ సర్వే విధానంపై ఇటీవల సర్వే విభాగానికి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటునట్లు ప్రకటించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్ పథకం 1999 లో కర్నాటక ల్యాండ్ రెవెన్యూ చట్టంలో చేసిన సవరణలతో ప్రారంభమై, 2005-06 నుంచి అమలులోకి వచ్చిందన్నారు.

ఈ పథకం ద్వారా భూముల రిజిస్ట్రేషన్‌కు ముందు మ్యూటేషన్ స్కెచ్‌ (PMS) తయారు చేస్తున్నారని, ప్రీ-రిజిస్ట్రేషన్ స్కెచ్‌తో కొనుగోలు చేయబోయే భూమి గురించి, విస్తీర్ణం, టైటిల్ వంటి స్పష్టమైన భూ సరిహద్దు వివరాలు ఉంటాయని అధికారులు గురువారం మంత్రికి వివరించారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు , 4 వేల మంది ప్రభుత్వ సర్వేయర్లు సేవలందిస్తున్నారన్నారు. ఒక్కో లైసెన్స్‌డ్ సర్వేయర్ కు నెలకు సగటున 23 దరఖాస్తులు వస్తాయన్నారు. దీని ద్వారా అతనికి నెలకు 25 వేల నుండి 30 వేల ఆదాయం వస్తుందని తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు నిర్వహించి, రిజిస్ట్రేషన్ కు ముందు స్కెచ్ తయారు చేసి పోర్టల్లో అప్ లోడ్ చేస్తారు. వీరి పనులను ప్రభుత్వ సర్వేయర్లు పరిశీలించి, సంబంధిత అధికారి (AD, S&LR) ఆమోదిస్తారు. ఈ పథకం ద్వారా భూ లావాదేవీలు మరింత సమర్థవంతంగా, శాస్త్రీయంగా సాగుతున్నాయని అధికారులు వివరించారు.

సర్వే మ్యాప్ తప్పనిసరి

తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకమైన భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ చట్టంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు భూమి సర్వే మ్యాపును జత పరచడం తప్పనిసరి చేసిన నేపధ్యంలో ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఈ విధానం అమలు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఆయా మండలాల్లో భూ లావాదేవీలు, భూ విస్తీర్ణాన్ని బట్టి సర్వేయర్లను నియమించాలని సూచించారు. కర్నాటక రాష్ట్రంలో దాదాపు 20 ఏండ్ల క్రితం నియమితులైన సర్వేయర్లు కొనసాగుతునే ఉన్నారని, ఇక్కడ కూడా అదే విధానాన్ని అవలంభించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page