![]()
తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ
తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్‌లను బదిలీ చేసిన స్టేట్ గవర్నమెంట్ తాజాగా ఇవాళ మరో ఆరుగురు ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్, పశువర్థక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్, వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా టీ.వినయ్ కృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీష్, టీఎస్ఐఆర్డీ సీఈవో పి. కాత్యాయని దేవి, గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్‌లను నియమించింది. కాగా, గత బీఆర్ఎస్ సర్కార్ హయంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఆఫీసర్ అమోయ్ కుమార్‌ను ప్రభుత్వం పశువర్థక శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మిస్సింగ్ ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసును సర్కార్ ఏసీబీకి అప్పగించగా, ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దగ్గరి మనిషిగా ఆరోపణలు ఉన్న అమోయ్ కుమార్‌కు ఈ శాఖ బాధ్యతలు అప్పగించడం హాట్ టాపిక్‌గా మారింది.


