![]()
మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: లార్డ్స్ టెస్టు రసవత్తరంగా మారింది. విజయం నీదా? నాదా? అన్నట్లుగా ఇంగ్లాండ్ – భారత్ పోటీ పడుతున్నాయి. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 58/4 స్కోరుతో ఉంది.
క్రీజ్‌లో కేఎల్ రాహుల్ (33*) ఉన్నాడు. ఆఖరి రోజు భారత్ మరో 135 పరుగులు చేయాలి. ఇంకా బ్యాటింగ్‌కు రిషభ్ పంత్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రావాల్సిఉంది. ఆఖర్లో జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్ ఆడతారు. ఈక్రమంలో ఇంగ్లాండ్ సహాయక కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ మాత్రం తమ జట్టు బౌలింగ్‌పై నమ్మకం ఉంచాడు. అదే సమయంలో టీమ్‌ఇండియాను ఒత్తిడికి గురిచేసేలా కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఊరిస్తుంది… అందుతుందా…!
”పిచ్ నుంచి బౌన్స్ కాస్త ఎక్కువగానే వస్తోంది. పెవిలియన్ ఎండ్‌తో పోలిస్తే నర్సరీ ఎండ్ నుంచి బౌలర్లకు అదనంగా సాయం లభిస్తోంది. స్లోప్‌ను మరికాస్త ఎక్కువగా యూజ్ చేసుకొని స్టంప్స్ లక్ష్యంగా బంతులేస్తాం. ఐదో రోజు ఉదయం కూడా ఇలానే ఉంటుందని భావిస్తున్నాం. తొలి గంటలోనే ఆరు వికెట్లు తీయాలని మా బౌలర్లకు చెబుతున్నా. అలాంటి అవకాశం ఉందని భావిస్తున్నా. నాలుగో రోజు ఆఖర్లో స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు తీయడంతో బౌలర్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇవాళ మొదటి గంట భారత్ బ్యాటర్లు ఎలా ఆడతారు? మా బౌలర్లు ఏవిధంగా బౌలింగ్ చేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. త్వరగా వికెట్లు తీస్తే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు వీలవుతుంది” అని మార్కస్ వెల్లడించాడు.
బషీర్ ఫిట్‌నెస్‌పై…
మూడో రోజు బౌలింగ్ చేస్తుండగా.. రవీంద్ర జడేజా కొట్టిన బంతి బషీర్ చేతిని బలంగా తాకింది. వెంటనే అతడు డగౌట్‌కు వెళ్లిపోయాడు. నాలుగో రోజు ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదో రోజు స్పిన్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న నేపథ్యంలో అతడి ఫిట్‌నెస్‌పై ట్రెస్కోథిక్ అప్‌డేట్ ఇచ్చాడు. ”బౌలింగ్ చేసేందుకు బషీర్ ఫిట్‌గా ఉన్నాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు బౌలింగ్ చేస్తాడు. ఒకవేళ అలా కుదరకపోతే మాత్రం కాస్త ఇబ్బందికరమే. అతడి అవసరం కచ్చితంగా ఉంది. ఇప్పటికైతే బౌలింగ్ చేసేందుకు సిద్ధమే” అని ఇంగ్లాండ్ కోచ్ వ్యాఖ్యానించాడు.


