![]()
నాణ్యతతో కూడిన వంట సరుకులు, సీజనల్ పండ్లు సరఫరా చేయాలి
-ఏజెన్సీదారులకు ఐటీడీఏ పీవో ఆదేశాలు
భద్రాచలం, మన భద్రాద్రి న్యూస్, జూన్ 28
ఈ విద్యా సంవత్సరానికి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు నాణ్యతతో కూడిన వంట సరుకులు మరియు సీజనల్ పండ్లు సరఫరా చేయాలని శుక్రవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సంబంధిత ఏజెన్సీదారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి మణెమ్మ, ఆర్సీఓ గురుకులం వెంకటేశ్వర రాజు, డీఎం జీసీసీ దావూద్, జిల్లా పరిషత్ కమిటీ సభ్యులు, ఏజెన్సీల యజమానుల సమక్షంలో టెండర్ బాక్సులను ఓపెన్ చేసి, ఏజెన్సీల ద్వారా సరఫరా అయ్యే వంట సరుకుల కొరకు నిర్వహించిన టెండర్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 19 గురుకుల పాఠశాలలో, ఎనిమిది ఈఎంఆర్ఎస్ పాఠశాలలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన ఆహారం అందించడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పేరుగాంచిన ఏజెన్సీల ద్వారా ఈ టెండర్ ప్రక్రియ కమిటీ సభ్యుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగిందని, కోడిగుడ్లు, అరటి పండ్లు కాక సీజన్ బట్టి దొరికే ఫలాలు, కూరగాయలు, స్కిన్ లెస్ చికెన్ నాణ్యతతో కూడినవి సరఫరా చేయడానికి టెండర్ ప్రక్రియలో 114 మంది ఏజెన్సీ దారులు టెండర్లు దాఖలు చేశారని, అందరికంటే తక్కువగా కోడ్ చేసిన వారికి ఈ వస్తువుల సరఫరా బాధ్యతను అప్పగించామని, నాణ్యత కూడిన సరుకులను మాత్రమే సరఫరా చేయాలని, ఏమాత్రం కల్తీ సరుకులు సరఫరా చేస్తే విద్యార్థిని, విద్యార్థుల యొక్క ఆరోగ్యం పాడైపోవడమేకాక వారి యొక్క చదువుకు భంగం కలుగుతుందని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ మరియు వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన వస్తువులనే సరఫరా చేయాలని, గురుకుల పాఠశాలల నుండి కానీ, ఈఎంఆర్ఎస్ పాఠశాలల నుండి కానీ వస్తువుల సరఫరా విషయంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీసీసీ అధికారులు, మేనేజర్లు, ఏజెన్సీ వారు సరఫరా చేస్తున్న వస్తువులను నాణ్యతగా ఉన్నవి లేనివి గమనించాలని, నాసిరకంగా ఉన్న వస్తువులను పాఠశాలలకు సరఫరా కాకుండా చూడాలని సూచించారు.
అలాగే ఇరువై మంది పిల్లలకు ఒకరు క్యాటరింగ్ మ్యాన్ పవర్ వర్కర్ ని అందుబాటులో ఉంచాలని, స్వీపింగ్, శానిటేషన్ సంబంధించిన ఏజెన్సీదారులు ప్రతి పాఠశాలలో డైనింగ్ హాల్, డార్మెటరీ, వంటగది, పాఠశాలలోని బాత్రూములు, టాయిలెట్లు, పాఠశాల ఆవరణ మరియు సైడ్ కాలువలు తప్పనిసరిగా శుభ్రంగా ఉంచాలని, శానిటేషన్ పరంగా పనిచేసే సిబ్బంది అరవై సంవత్సరాల లోపు వయస్సు వారు ఉండి ప్రతిరోజూ స్వీపింగ్, శానిటేషన్ పరంగా ప్రత్యేక బాధ్యతలు తీసుకొని పనిచేయాలని, సంబంధిత ప్రిన్సిపాల్ లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొవాలని, పాఠశాలలకు, ఏజెన్సీదారులు పంపిస్తున్న వర్కర్లు రాకపోతే మా దృష్టికి తీసుకొని రావాలని, టెండర్ ప్రక్రియలో కోడ్ చేసిన వస్తువులు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు, అరటి పండ్లు సీజన్ ను బట్టి పండ్లు, కూరగాయలు, స్కిన్లెస్ చికెన్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని ఆయన అన్నారు. నాసిరకంగా ఉన్న సరుకులు సరఫరా చేస్తే వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని ఆయన అన్నారు. క్యాటరింగ్ మ్యాన్ పవర్ మరియు స్వీపింగ్ శానిటేషన్ కొరకు నియమించబడ్డ సిబ్బందికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉండాలని ఆయన తెలుపుతూ, ఏజెన్సీదారుల నుండి ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత ప్రిన్సిపాల్ లు వెంటనే మా దృష్టికి తీసుకొని రావాలని ఆయన అన్నారు. ఎప్పుడైనా గురుకుల పాఠశాలలకు, ఈఎంఆర్ఎస్ పాఠశాలలకు ఆకస్మిక తనిఖీకి వెళ్ళినప్పుడు నాసిరకమైన వస్తువులు సరఫరా చేస్తున్నట్లు నా దృష్టికి వస్తే సంబంధిత ఏజెన్సీదారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పర్యవేక్షకులు కృష్ణార్జున, ఏవో నరేందర్, మహిళా డిగ్రీ కళాశాల ఏవో ప్రమీల, గురుకుల ఈఎంఆర్ఎస్, పాఠశాలల ప్రిన్సిపాల్ లు, గురుకుల సిబ్బంది వరలక్ష్మి, చంటి, గణేష్, శ్రీనివాస్, లిఖిత్, ఏజెన్సీదారులు, తదితరులు పాల్గొన్నారు.


