![]()
- పిల్లలను స్కూల్ బస్సు ఎక్కించి తిరిగి వస్తుండగా ఘటన
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: నీటి ట్యాంకర్ ఢీకొని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దుర్మరణం పాలైన ఘటన రంగారెడ్డి జిల్లా మణికొండలో మంగళవారం చోటు చేసుకుంది.
రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరు – కొండముడుసుపాలెంకు చెందిన ఇరువురి శాలిని(34), వెంకటేశ్వర్లు దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చి మణికొండలోని పుప్పాలగూడ హేమదుర్గ శివహిల్స్ ప్రాంతంలోని బీఆర్‌సీ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. వారి పిల్లలు సుదీక్ష(13), సహస్ర(9) జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదువుతున్నారు. రోజూ పాఠశాల బస్సులోనే వెళ్లేవారు. మంగళవారం ఉదయం ఇంటి సమీపంలో బస్సు ఆగే చోటుకు వారు సకాలంలో చేరుకోలేకపోయారు. బస్సు వెళ్లిపోవటంతో తల్లి పిల్లలను స్కూటీపై తీసుకెళ్లారు. 4 కి.మీ.ల దూరంలోని రాయదుర్గం చౌరస్తా వద్ద బస్సును చేరుకుని పిల్లలను అందులో ఎక్కించారు.
ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా మణికొండ సుందర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్దకు రాగానే నీటి ట్యాంకర్ స్కూటీని ఢీకొట్టింది. ఆమె కింద పడిపోగా ట్యాంకర్ వెనక చక్రం తల మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన శాలిని అక్కడికక్కడే మృతిచెందారు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం పనిమీద విజయవాడకు వెళ్లిన ఆమె భర్త వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వగా నగరానికి బయలుదేరారు. తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లటాన్ని చిన్నారులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులను కంటనీరు పెట్టించింది.


