![]()
-మంత్రి సీతక్క
మన భద్రాద్రి వెబ్ డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని, వారంలోగా స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని మంత్రి సీతక్క తెలిపారు. కేబినెట్లో నిర్ణయం తీసుకోకుండా ఎలా చెబుతానని అన్నారు. నేను ఎన్నికల డేట్ చెప్పినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. అది అవాస్తవం. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకొని వార్తలను వేయాలి. నేను అనని మాటలు అన్నట్లుగా వార్తలు ఇవ్వడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. నేను వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పినట్లుగా ఆధారాలు చూపిస్తారా? అని ప్రశ్నించారు.
20 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్నానని, స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయో తనకు తెలియదా? అని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాకారం అవుతుందని అన్నారు. ఇందుకు సంబంధించిన బిల్లును సైతం అసెంబ్లీలో పాస్ చేశామని, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఎన్నికల్లో జాప్యం జరుగుతున్నదని స్పష్టం చేశారు.
కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతిలో ఉందని, అలాంటప్పుడు 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న దానిపై చర్చిస్తామన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి అట్టడుగు వర్గాలను అణగదొక్కిన బీఆర్ఎస్ ఇప్పుడు బీసీలకు 42 శాతం అని కూనిరాగాలు తీస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.


