Monday, March 23, 2026
HomeTelangana Newsపదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించండి

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించండి

Loading

-అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్, మన భద్రాద్రి న్యూస్, మార్చి 13

పదో తరగతి పరీక్షలను కఠిన ఆంక్షలతో నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.గత ఏడాది జరిగిన పలు ఘటనల నేపథ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాలతో పరీక్ష కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.పరీక్ష పూర్తయ్యేంత వరకు అవసరమైతే జామర్లు ఏర్పాటు చేసి, ఫోన్ సిగ్నల్స్ ఆఫ్ చేయించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బంది, విద్యార్థులు ఎవరికీ ఫోన్లు అందుబాటులో లేకుండా చూడనున్నారు.పరీక్షా కేంద్రాలా నుండి ప్రశ్నాపత్రాలు బయటకు వెళ్లకుండా, మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు.ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

సెల్‌ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే..!!

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్‌ఫోన్ల వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పరీక్ష సిబ్బంది, స్కాడ్‌ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి.ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్‌, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు.వీరు తమ సెల్‌ఫోన్లను ఆరుబయటే పెట్టాల్సి ఉంటుంది.పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్‌ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌ చేస్తారు.పేపర్‌ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.గత ఏడాది పదో తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లలో ప్రత్యక్షంకావడం, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఎస్సెస్సీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.పరీక్షల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు.విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే -23230942 నంబర్‌ను సంప్రదించవచ్చు.ఈ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఇప్పటికే 12 మంది ఉన్నతాధికారులను జిల్లాస్థాయి అబ్జర్వర్లుగా నియమించారు.విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించగా, విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌చేసుకునే అవకాశాన్నిచ్చారు.విద్యార్థులు హాల్‌టికెట్‌ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో పరీక్షాకేంద్రాల సమీప స్టేషన్‌ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డు నామినల్‌రోల్స్‌, ఫొటో అటెండెన్స్‌ షీట్లు జిల్లాలకు చేర్చగా, తాజాగా ఓఎమ్మార్‌, ప్రశ్నపత్రాలు, సమాధానాలు రాసే పేపర్లు, బుక్‌లెట్‌లను జిల్లాలకు పంపనున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page