![]()
-మారుమూల గ్రామాలలో వైద్య శిభిరాల నిర్వహణ
-రోడ్డు మార్గాలు లేని గ్రామాలకు కాలినడకన వెళుతున్న సిబ్బంది
-హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూలై 04
గిరిజన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తే ఇదేనా మనం సాధించిన ప్రగతి, ఇదేనా మన అభ్యున్నతి అని అనిపించక మానదు. ప్రపంచం మారినా మారుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. అడవిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల బ్రతుకులు మారడం లేదు. అలాంటి గ్రామాలకు మేమున్నామంటూ వాగులు పొంగినా, వరదలు వచ్చినా, రోడ్డు మార్గం లేకపోయినా కాలినడకన గిరిజన గ్రామాలు తిరుగుతూ వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది.
మారుమూల గ్రామాల్లో వైద్య శిభిరాలు
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు పట్ల గ్రామీణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు మెడికల్ అధికారి డాక్టర్ శ్రీధర్, డాక్టర్ దివ్యనయన చర్ల, సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని మారుమూల అటవీ గ్రామాలైన కందిపాడు, వెంకట చెరువు, క్రాంతిపురం, కిష్టారం పాడు, బట్టి గూడెం, బత్తినపల్లి, గోరుగొండ, బూరుగుపాడు గ్రామాల్లో వైద్య శిభిరాలను నిర్వహిస్తూ పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తున్నారు. గర్భిణీలను పరీక్షించి నెల నెల ఆరోగ్య కేంద్రంకు రావాలని, వైద్యులు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలని సూచిస్తూ పలు జాగ్రత్తలను పాటించాలని వారికి తెలియజేస్తున్నారు. ప్రతి గ్రామంలోని వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరాలు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని తెలుపుతూ పలు గ్రామాలు తిరుగుతు తగు జాగ్రత్తలు చెబుతున్నారు.
వాగులు వంకలు దాటుతూ కాలినడకన వెళ్తున్న సిబ్బంది
వర్షాకాలం వచ్చిందంటే వరదల భయం. వాగుల కారణంగా అనేక గ్రామాలకు రహదారి మార్గంలో చేరుకోలేని పరిస్థితి. అలాంటి సమయాల్లో కూడా వైద్య ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోడ్డు సౌకర్యం ఉన్న వరకు వాహనాలపై వెళ్లి అక్కడినుండి కాలినడకన గిరిజన గ్రామాలు చేరుకుంటారు. ఒక్కోసారి పడవల్లో ప్రయాణించాల్సి వస్తుంది. మోకాలి లోతు, నడుము లోతు నీటిలో నడిచి వెళుతూ వైద్య సేవలు అందిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిన రోగులను అతి కష్టం మీద గ్రామస్థుల సహాయంతో ఆరోగ్య కేంద్రాలకు తరలిస్తు వైద్య సేవలు అందిస్తుంటారు.
హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
మండలంలోని ప్రభుత్వ వైద్యులు మారుమూల గ్రామాల బాట పట్టారు. ప్రతి గ్రామాన్ని విడిచి పెట్టకుండా గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధులపై సూచనలు, సలహాలు ఇస్తూ అవగాహన కల్పిస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రతిరోజూ ఏదో ఒక గ్రామానికి వెళ్లి అక్కడ వైద్య శిభిరం ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు టీకాలు వేస్తున్నారు. ప్రతి నెల గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సేవలు కల్పిస్తున్నారు. రోగుల నుండి రక్త నమూనాలు సేకరించి వారికి మందులు అందించడం, పలు సూచనలు, సలహాలు ఇస్తూ వైద్య శిభిరాలు నిర్వహించి తమదైన ముద్రను వేసుకుంటూ గిరిజనుల మన్ననలు పొందుతున్నారు.


