![]()
- బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సంచలన లేఖ వైరల్
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగుతోంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ కవిత కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాసినట్లుగా ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేఖలో ఉన్న ప్రకారం.. ‘మా ఆడబిడ్డ కవితక్కకి.. 2023లో అనుకోకుండా బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. వెంటనే కేసీఆర్ గారికి పెద్ద గాయం తగిలిన విషయం తెలిసిందే. ఆ దెబ్బ ఇంకా కోలుకోకముందే మీరు అరెస్టయ్యారు. ఆ బాధలో ఉన్న సమయంలో పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పార్టీకి నమ్మక ద్రోహం చేసి వెళ్లిపోయారు. అంతలోనే ప్రమాదవశాత్తు కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణం. దీనితోపాటు వెంటనే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్ పార్టీకి అక్కడ దారుణమైన ఓటమి ఎదురైంది’ అని లేఖలో పేర్కొన్నారు.
- మీ ఇంట్లో కోట్లాట మీ కుటుంబంతో మాట్లాడుకోండి…
ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు చూసిన బీఆర్‌ఎస్ పార్టీకి, శక్తిని ఇచ్చింది.. పునర్జీవం పోసింది మన బీఆర్‌ఎస్ పార్టీ సామాన్య సోషల్ మీడియా వారియర్లు మాత్రమేనని లేఖలో రాసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికలయ్యి 20 నెలలు పూర్తవుతున్నాయని, ఈ కష్టకాలంలో బీఆర్‌ఎస్ చేస్తున్న పోరాటంలో ఎంతో మంది సోషల్ మీడియా కార్యకర్తలు కేసుల్లో చిక్కుకుపోయారని, జైళ్లకు వెళ్లారని తెలిపారు. వారిలో చాలామందికి పార్టీ పదవుల మీద ఆశ లేదని, అయినా, వాళ్లు నిస్వార్థంగా పోరాడుతున్నారని ఆవేదన తెలిపారు. అలాంటి బీఆర్‌ఎస్ పార్టీ మీద, కార్యకర్తలపై మీరు చేసిన అనవసరమైన వ్యాఖ్యలు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. మీరు చేసిన వ్యాఖ్యలలో ముఖ్యంగా- బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని, సామాజిక తెలంగాణ రాలేదని, నిజామాబాద్‌కి నిధులు ఇవ్వలేదని, పార్టీలో దెయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు పార్టీకి ఎంతో కాలంగా సేవలు చేసిన సీనియర్ నాయకుడిని “లిల్లిపుట్” అని టార్గెట్ చేయడం బాధాకరమని వెల్లడించారు. కష్టకాలంలో పార్టీ కోసం కొట్లాడుతున్న సీనియర్ నాయకులని లిల్లీ పుట్ అని, బీఆర్‌ఎస్ పార్టీ కోసం పోలీస్ కేసులు మీద వేసుకొని పని చేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలని పెయిడ్ బ్యాచ్ అని మీరు అవమానించడం, చాలా బాధకరమన్నారు.
మీ ఇంట్లో కోట్లాట ఉంటే, మీ కుటుంబంతో మాట్లాడుకోండి, అంతే కాని బీఆర్‌ఎస్ పార్టీ మీ సొంత ఆస్తి లెక్క అనుకోకండని సూచించారు. అది కేసీఆర్‌ది, తెలంగాణ ఉద్యమ కారులు, పార్టీ కార్యకర్తలే దానికి యజమానులు అని పేర్కొన్నారు. ఇప్పటికైనా, మీ గొడవలు త్వరగా తేల్చుకోండి, బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం పని చేయండి.. అని సూచించారు. మీరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఒక్క రోజు కూడా బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కోసం పని చేయలేదని విమర్శించారు. తెలంగాణ జాగృతికి బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారని తెలిపారు. ఇట్లు, నిస్వార్థమైన బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అంటూ ఓ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది.


