Tuesday, March 24, 2026
HomeHyderabadపెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌కు సీఎం రేవంత్ టీమ్..!

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌కు సీఎం రేవంత్ టీమ్..!

Loading

  • ఆ అంశాలపైనే స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, మన భద్రాద్రి బ్యూరో

సింగపూర్ పర్యటనను ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్‌కు చేరుకుంది.భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ టూర్ కొనసాగనున్నది. అక్కడ నాలుగు రోజులపాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో సీఎం, మంత్రి, అధికారులు పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలు, సంస్థల ఎండీలు, అధినేతలతో భేటీ కానున్నారు. ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కాగా, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి దావోస్ పర్యటనకు వెళ్లలేదు. సమావేశాల్లో పాల్గొన్నదీ లేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండోసారి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటుండడం గమనార్హం.

సింగపూర్ పర్యటన సక్సెస్

సింగపూర్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీ బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చలు జరిపింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకున్నది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. రూ.3,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకున్నది. దాదాపు రూ.450 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేయనుంది.

రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్‌ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. చివరి రోజు ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్ బీఎఫ్) ప్రతినిధులతో రాష్ట్ర ప్రతినిధి ముఖాముఖి, సంభాషణలు, చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్‌ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్‌ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్‌ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్ తో డిస్కషన్స్ చేసింది. హైదరాబాద్ లో పెట్టుబడులు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించింది.

దావోస్ టూర్‌ పై భారీ అంచనాలు

సింగపూర్ టూర్ సక్సెస్ కావడంతో దావోస్ పర్యటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, బయోసైన్స్, డేటా సెంటర్, ఫోర్త్ సిటీ, స్కిల్స్ యూనివర్శిటీలో పెట్టుబడులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ స్థాయి కంపెనీలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. వాటి కొనసాగింపుతోపాటు విస్తరణ, మరిన్ని కంపెనీల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, సానుకూలతలను ఈ టూర్ లో వివరించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఫార్మా సిటీ కోసం భూమి సేకరించింది. రెడ్ కేటగిరి పరిశ్రమలు కావడంతో పర్యావరణ అనుమతులు తీసుకొని భూములను సిద్ధం చేసింది. ఇక్కడ కంపెనీలు పెట్టడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ప్రపంచంలోనే 35 శాతం వ్యాక్సిన్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో మరిన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. యువతలో స్కిల్స్ పెంపొందించడంపై దృష్టి పెడుతున్నారు. వీటిల్లో పెట్టుబడులను ఆకర్షించడం, ఆ కంపెనీలను భాగస్వామ్యం చేయడంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతేడాది దావోస్ పర్యటనలో రూ. 40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, ఈ సారి కూడా భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్ల టైమ్ నడుస్తున్నది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇంకా మరికొన్ని కంపెనీలను ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షించేలా వ్యూహం సిద్ధం చేశారు. ఫార్మా సిటీ ప్రాంతంలో వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

You cannot copy content of this page