![]()
-భూమిలేని నిరుపేదలకే రైతు ఆత్మీయ భరోసా అందించండి
-మద్దుకూరు గ్రామ సభలో గ్రామస్థుల ఆవేదన
-అధికారులను నిలదీసిన గ్రామస్థులు
చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, జనవరి 21
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను జనవరి 26 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేయగా మండలంలోని గ్రామసభల నిర్వహణలో స్వల్ప ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మద్దుకూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్న అందరూ పథకాలను పొందుతారని, కొంతమంది పేర్లు అర్హత ఉండి కూడా రానివారు గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ప్రతి గ్రామ సభలో దరఖాస్తు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు గ్రామ సభలలో అర్హుల పేర్లును ప్రకటించిన తర్వాత రైతు ఆత్మీయ భరోసా పథకంలో మాకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది గ్రామస్థులు అధికారులను నిలదీశారు. గ్రామస్థులు మాట్లాడుతూ ఎటువంటి షరతులు లేకుండా భూమిలేని నిరుపేదలకు రైతు ఆత్మీయ భరోసా అందించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులకు, గ్రామస్థులకు మధ్య కొంత వాగ్వాదం జరగగా అధికారులు ప్రభుత్వ నిబంధనలు మేరకే అర్హులను ప్రకటించామని, అర్హత ఉన్నవారు గ్రామ సభలో దరఖాస్తు చేసుకోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి అశోక్ తహసీల్దార్ సంధ్యారాణి, ఆర్ఐ అక్బర్ బాబు, ఏఈవో శ్రీనివాసరావు, ఈసీ నరేష్, పీసీ కృష్ణకుమారి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.


