![]()
మన భద్రాద్రి స్పోర్ట్స్ న్యూస్: నాలుగో టెస్టులో మూడు రోజులు ఇంగ్లాండ్ ఆధిపత్యం సాగగా నాలుగో రోజు భారత్ పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడిన టీమ్ ఇండియా డ్రా కోసం పోరాటాన్నే నమ్ముకుంది.
శనివారం ముందుగా తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ 669 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(141) సెంచరీని పూర్తి చేసుకోగా.. బ్రైడెన్ కార్సే(47) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు ఏకంగా 311 పరుగుల భారీ ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 358 రన్స్ చేసిన విషయం తెలిసిందే. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 174/2 స్కోరు చేసింది. కెప్టెన్ గిల్(78 బ్యాటింగ్), రాహుల్(87 బ్యాటింగ్) ఆదుకోవడంతో భారత్ ప్రస్తుతం మెరుగైన స్థితిలోనే ఉంది. అయితే, ఇంకా 137 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్‌లో ఆదివారమే చివరి రోజు. భారత్‌కు ఓటమి గండం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. చివరిరోజు వికెట్లు కాపాడుకుంటూనే డ్రా అవుతుంది. లేదంటే ఓటమి తప్పదు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని రోజు మొత్తం టీమిండియా బ్యాటింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నదే.
- స్టోక్స్, కార్సే కీలక ఇన్నింగ్స్..
మూడో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ స్కోరు 544/7. ఆ జట్టును 600లోపు కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఇంగ్లాండ్ 669 పరుగులు చేసిందంటే కారణం కెప్టెన్ బెన్ స్టోక్సే. బ్రైడెన్ కార్సే(47) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓవర్‌నైట్ స్కోరు 77తో ఆట కొనసాగించిన స్టోక్స్ భారీ శతకాన్ని నమోదు చేశాడు. మూడో రోజు నిదానంగా ఆడిన అతను నాలుగో రోజు ధాటిగా ఆడాడు. బౌండరీలు కొట్టేందుకు వెనకాడలేదు. అయితే, మరో ఎండ్‌లో డాసన్(26)ను బుమ్రా, క్రిస్ వోక్స్(4)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆలౌట్‌కు చేరువైంది. కానీ, స్టోక్స్‌కు కార్సే తోడవడంతో ఆలౌట్ ఆలస్యమైంది. స్టోక్స్, కార్సే ధాటిగా ఆడుతూ 9వ వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు 650 దాటి తిరుగులేని స్థితిలో నిలిచింది. జడేజా వరుస ఓవర్లలో స్టోక్స్, బ్రైడెన్ కార్సేను అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ ఆట ముగిసింది. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, సుందర్ చెరో 2 వికెట్లు తీశారు.
షాక్‌ను తట్టుకుని నిలబడి
తొలి సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ను కూల్చి రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక తగిలింది. క్రిస్ వోక్స్ ఒకే ఓవర్‌లో వరుస బంతులకు జైశ్వాల్(0), సుదర్శన్(0)లను డకౌట్ చేశాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకముందే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కేఎల్ రాహుల్, కెప్టెన్ గిల్ జట్టును ఆదుకున్నారు. తమ వికెట్లు కూడా పడితే జట్టు మరింత కష్టాల్లో పడుతుందని భావించిన వారు సందర్భోచిత ఇన్నింగ్స్ ఆడారు. దూకుడుకు పోకుండా ఆచితూచి ఆడుతూ వికెట్లు కాపాడుకున్నారు. వికెట్ల మధ్య పరుగులు తీస్తూనే అడపాదడపా బౌండరీలూ కొట్టారు. క్రీజులో పాతుకపోయిన వీరిని అవుట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్ల వ్యూహాలు ఫలించలేదు. రాహుల్, గిల్ కలిసి భారత్‌ను 174/2తో మెరుగైన స్థితిలోనే నిలబెట్టి డ్రా దిశగా నడిపిస్తున్నారు. కానీ, ఆఖరి రోజు వికెట్లు కాపాడుకోవడంపైనే భారత్ సిరీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.


