![]()
పోసాని రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలునటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది కులాలు, వర్గాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. పవన్, లోకేశ్ కుటుంబ సభ్యులను దూషించినట్లు అంగీకరించారు. తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందన్నారు. సజ్జల రాసిచ్చిన స్క్రిప్టు మేరకే విమర్శలు చేశానని పోసాని చెప్పినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పవన్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే తాను మాట్లాడినట్లు వెల్లడించారు.
ఎఫ్డీసీ ఛైర్మన్‌గా ఉంటూ వైకాపాకు మద్దతుగా వ్యవహరించానని పోసాని పోలీసులకు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పవన్‌ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని, అతడి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు పోసాని పేర్కొన్నారు. తాను మాట్లాడిన మాటలను సజ్జల తనయుడు భార్గవరెడ్డి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసేవాడన్నారు. ఈ మేరకు పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్టును పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు.
కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి ఇటీవల అరెస్టయిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు కోర్టు గురువారం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 12 వరకు పోసాని రిమాండ్‌లో ఉండనున్నారు. పోసాని ప్రస్తుతం రాజంపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.


