![]()
-మండల వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్
టేకులపల్లి, మన భద్రాద్రి న్యూస్, మే 16
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా గురువారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో వైద్య మరియు ఐసిడిఎస్ సిబ్బందితో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అవగాహనా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ మంది మరణానికి కారణం అవుతున్నది అత్యంత చిన్న కీటకం దోమ అని, దోమల వృద్ధికి అనుకూలమైన, అపరిశుభ్రమైన పారిశుద్ధ్య పరిస్థితులు మానవుడే కల్పిస్తున్నాడని తెలిపారు. దోమకాటు ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని, గ్రామంలోని ప్రతీ ఇల్లు, ప్రతీ వీధి అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎటువంటి నీటి నిల్వలు లేకుండా చూసుకుని, ప్రతీ మంగళవారం, శుక్రవారం విధిగా డ్రై డే పాటిస్తూ, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. ఆడ ఎడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం ద్వారా వచ్చే ఈ డెంగ్యూ వ్యాధి, తీవ్రమైన జ్వరం, తలనొప్పి కనుగుడ్డు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి, కండరాలు, ఎముకలు మరియు కీళ్లల్లో నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని వివరించారు. నిర్లక్ష్యం చేసినట్లయితే డెంగ్యూ హేమరేజ్ ఫీవర్ లో ముక్కులో నుండి పండ్ల చిగుళ్లలో నుండి రక్తస్రావం, రక్తస్రావంతో కూడిన మలమూత్రంలు ఉంటాయని హెచ్చరించారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్దేశించిన దినాలలో డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు టీ హబ్ ద్వారా ఉచితంగా చేస్తామని ఈ సందర్భంగా వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి, ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ, ఆరోగ్య విస్తరణ అధికారి దేవా, సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు, గుజ్జ విజయ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు అనురాధ, సక్కుబాయి, ఏఎన్ఎంలు అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


