![]()
అశ్వారావుపేట, మన భద్రాద్రి న్యూస్, జూన్ 06
మండలంలోని గుమ్మడవల్లి ప్రాజెక్ట్ లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అరకోర వసతులతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరతతో, వర్షాకాలం వచ్చిందంటే కరెంటు సమస్యతో ఆరోగ్య కేంద్రం మొత్తం చీకట్లు అలముకోవడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. లక్షల విలువ చేసే సామాగ్రి ఉన్నా, వచ్చిన రోగులకు రక్షణ లేకపోగా కరెంట్ పోతే సెల్ ఫోన్ లైటింగ్ లోనే వైద్యం అందించాల్సిన పరిస్థితి దాపరించింది. క్షేత్రస్థాయిలో రోగులకు సహాయపడే సిబ్బంది కొరత వేధిస్తుండడంతో, కనీస వసతులు సైతం పూర్తిగా కల్పించకపోవడంతో రోగులు అసహనానికి గురవుతున్నారు. చుట్టు ప్రక్కల సుమారుగా 20 గ్రామాలకు పైగా వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుండడంతో పలువురు విస్మయానికి గురవుతున్నారు. వర్ష కాలం వచ్చిందంటే ఏజెన్సీ ఏరియాలు కావడంతో ఎక్కువగా ఈ ఆసుపత్రిపైనే ప్రజలు ఆధార పడుతున్నారు. అశ్వారావుపేట మండల కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్ళాలంటే సుమారుగా 25 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి దారి చూపాలని ప్రజలు వేడుకుంటున్నారు.


