![]()
ప్రమాదకరంగా మారిన ప్రధాన రహదారి
-రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు
-నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ప్రజల వెతలు
-పట్టించుకోని సంబంధిత అధికారులు
చర్ల, మన భద్రాద్రి న్యూస్, జూన్ 28
చర్లలోని ప్రధాన రహదారుల ఆక్రమణలతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రతరమౌతోంది. ప్రధాన రహదారులతోపాటు కూడళ్ల వద్ద ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రాకపోకలకు తగ్గట్లు ప్రభుత్వం 100 అడుగుల రోడ్డును, అలాగే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించింది. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రధాన వీధుల్లో వ్యాపారస్థులు డ్రైనేజీ లైన్లను దాటి రోడ్డుకి దగ్గరలో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. వినియోగదారులు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపివేయడంతో ఇరువైపులా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. వ్యాపారస్థులు తమ దుకాణాలను డ్రైనేజీ అవతల ఏర్పాటు చేసుకోవాలి. కానీ మండల కేంద్రంలో మాత్రం ప్రధాన రహదారి పక్కనే వ్యాపారాలు కొనసాగించడంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, పలు ప్రభుత్వ వసతి గృహాలు, లక్ష్మీ కాలనీ, దోసిల్లపల్లి, తిప్పాపురం ఇలా అనేక గ్రామాలకు వెళ్లాలంటే బస్టాండ్ ముందు ఉన్న రోడ్డు నుండి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు వివిధ పనుల రీత్యా మండల కేంద్రానికి వచ్చేవారికి మూలములుపు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆటో కార్మికులకు ఆటో నిలుపుదల స్టాండు లేకపోవడంతో రోడ్డుపై ఆటోలను ఆపి ప్రయాణీకులను ఎక్కించుకునే పరిస్థితి. మరోవైపు వ్యాపారస్థులు వారికి కేటాయించిన పరిధిని మించి డ్రైనేజీ వ్యవస్థను దాటి ప్రధాన రహదారికి దగ్గరగా వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. దీంతో అటుగా వచ్చే వాహనాలు కనపడక విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ దాటి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని మండల ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.


