![]()
హైదరాబాద్, మన భద్రాద్రి వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం అందిస్తున్న మహాలక్ష్మీ పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిగిస్తున్న కారణంగా బస్సుల వినియోగం బాగా పెరిగింది.
ఇదే సమయంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సుల సేవలను మెరుగు పరుస్తూ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కూడా ఆర్టీసీ బస్సుల వాడకం బాగా పెరిగింది. గతం కంటే ఎక్కువగా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు.
బస్సులలో పెరిగిన సీట్ల భర్తీ
మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం ప్రారంభమైన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. బస్సులకు ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా పెరిగింది.ప్రస్తుతం సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. గతంలో బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి దాదాపు 67 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది 95 శాతానికి పెరిగింది.
బస్సుల్లో రద్దీతో నిలబడే ప్రయాణాలు
ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో అయితే రద్దీ 110 శాతం దాటుతోంది. దీంతో బస్సుల్లో సీట్లు లేక నిలబడి ఇబ్బంది పడుతూ ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది. కొన్ని బస్సులలో కనీసం నిలబడటానికి కూడా స్థలం లేకుండా పరిస్థితి మారింది. దీంతో బాలింతలు, గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. ఫుట్ బోర్డులపై ప్రయాణికులు నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు.
కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్న ఆర్టీసీ
దీంతో ఎక్కడైతే బస్సుల అవసరం ఉందో, బస్సుల కోసం ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సిద్ధమైంది. త్వరలోనే 503 కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి.తెలంగాణ ఆర్టీసీ రూ.193.44కోట్ల వ్యయంతో 503కొత్త బస్సులను కొనుగోలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ బస్సులను పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులకు కేటాయించనున్నారు.
కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే నిలబడి ప్రయాణం చేసే ఇబ్బందులకు చెక్
ఏ ప్రాంతాలలో ఎక్కువ అవసరం ఉందో గుర్తించి ఆ ప్రాంతాలకు వాటిని కేటాయించనున్నారు. దీని ద్వారా ప్రయాణికుల రద్దీని తగ్గించి, మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే నిలబడి ప్రయాణం చేసే ఇబ్బందులు తొలగిపోయి ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. తద్వారా ఆర్టీసీ తన సేవలను కూడా గ్రామీణ ప్రాంతాలకు మరింత విస్తరించవచ్చు.


