![]()
ఖమ్మం, మన భద్రాద్రి వెబ్ డెస్క్: గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
కమిషన్ల కోసమే ప్రాజెక్టు మధ్యలో పనులను అర్ధాంతరంగా ముగించేసిందని విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో రూ. 630 కోట్లతో నిర్మించ తలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన ఈ సందర్భంగా ఆభివర్ణించారు.
10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా నిర్మించాడా? అని ప్రజలను ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న బియ్యం పంపిణి చేశాడా? అంటూ ప్రజలను అడిగారు. రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉంటుందని.. అంతేకానీ ఓట్లపై ఉండదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అపర భగీరథుడని ఈ సందర్భంగా అభివర్ణించారు.


