![]()
-ప్రజల ప్రాణాలు తీస్తున్న ఇసుక లారీలు
-అధిక లోడు, మితిమీరిన వేగంతో ఇసుక లారీలు
-ఈ మార్గంలో అనుమతి ఇవ్వొద్దంటున్న ప్రయాణీకులు
-వరుస రోడ్డు ప్రమాదాలతో రెండు రోజులలో ముగ్గురు మృతి..
-రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన బాధిత గ్రామస్థులు..
దుమ్ముగూడెం, మన భద్రాద్రి న్యూస్
ఆ రోడ్డు ప్రముఖ పుణ్యక్షేత్రానికి ప్రధానమైన రహదారి. ఈ రహదారి గుండా ప్రతిరోజు నిత్యం వేలాదిగా పర్ణశాలకు వచ్చే భక్తులు, వందల సంఖ్యలో తిరిగే వాహనాలు. ఇదే మార్గం గుండా ఛత్తిస్ ఘడ్ రాష్ట్రానికి నిత్యం రాకపోకలు కొనసాగుతాయి. కానీ ఈ మార్గం గుండా వెళ్లాలంటే మాత్రం ప్రయాణీకులకు, వాహనదారులకు తమ గమ్యం చేరుతామన్న గ్యారంటీ లేకుండా పోయింది. గమ్యాన్ని చేరుకునే దాకా ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణించాల్సిందే.. ధ్వంసమైన రోడ్డుతో నిత్యం ప్రయాణీకులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి ఏటా ఈ ఇసుక లారీల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలతో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎన్ని ప్రాణాలు పోతున్నా అధికారులకు మాత్రం పట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇసుక లారీలతో రోడ్డు మొత్తం ధ్వంసమై, అనేక ప్రమాదాలకు నిలయంగా మారింది. రోడ్డు మరమ్మత్తుల సంగతి పక్కన పెడితే గత వారం రోజులుగా ఇసుక లారీలు నియంత్రణ లేని స్పీడ్ తో ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఐదు రోజులుగా క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నర్సాపురంకు చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మరువకముందే అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు వల్ల, దానికి తోడు లారీల అధిక లోడు, మితిమీరిన వేగంతో రోజు గడిచి రోజు మరవక ముందే మూడు ప్రాణాలను బలితీసుకుంది. జడ్ వీరభద్రపురం గ్రామానికి చెందిన రాంబాబు గోగుబాక ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం కూడా ఇదే తరహా రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా చింతగుప్ప గ్రామపంచాయతీ సుజ్ఞానపురం గ్రామానికి చెందిన వ్యక్తులు లారీ వారి మీద నుంచి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో వారు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. నియంత్రణలేని లారీల స్పీడుతో ప్రాణాలు పోతున్నా అధికారులు స్పందించడం లేదని, ఈ లారిలతో మా ప్రాణాలు పోతున్నాయి సారూ అంటూ బాధిత గ్రామస్థులు, ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిక లోడు, మితిమీరిన వేగంతో వచ్చే లారీలను ఈ మార్గం గుండా వెళ్లేందుకు అనుమతి ఇవ్వవద్దు
ఇసుక లారీలకు ఈ మార్గం గుండా అనుమతులు ఇవ్వొద్దని, ఇసుక రీచ్లు ఈ మార్గంలో లేకున్నా ఎందుకు అనుమతులు ఇస్తున్నారని ప్రయాణీకులు మండిపడుతున్నారు. ఇప్పటికే అధ్యయనంగా రహదారిపై మళ్ళీ ఇసుక లారీలతో అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, ఇసుక లారీ డ్రైవర్లు, క్లీనర్లతో వాహనాలు నడిపించి, మద్యం మత్తులో నియంత్రణ లేని డ్రైవింగ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ ప్రధాన రహదారి బాగోగులు చూసైనా ఇసుక లారీలను పూర్తిగా నియంత్రించాలని, లేకుంటే ప్రమాదాలకు నిలయంగా రహదారి మారే పరిస్థితి ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
రెండు రోజుల్లో ముగ్గురు మృతి..రహదారిపై నిరసన తెలిపిన బాధిత గ్రామస్థులు
లారీ ప్రమాదంలో రెండు రోజుల్లో జడ్ వీరభద్రపురం గ్రామానికి చెందిన కొమరం రాంబాబు, సుజ్ఞానపురం గ్రామానికి చెందిన వీరస్వామి, సోమ్ల అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందడంతో రెండు గ్రామాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు లారీలపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిరసన తెలుపుతూ మండల పరిధిలోని రామచంద్రపురం ప్రధాన రహదారిపై టెంట్ వేసి నాలుగు గంటల పాటు నిరసన తెలుపుతూ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు బాధిత కుటుంబాలకు నచ్చజెప్పి ప్రయత్నం చేసినా కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చేంతవరకు విరమింప చేయమని రాస్తారోకో నిర్వహించారు. నిరసన తెలుపుతున్న బాధిత కుటుంబాలకు తోటి వారు కూడా తోడవడంతో లారీలను నియంత్రించాలని, ఈ మార్గం గుండా అనుమతించొద్దంటూ రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమింపజేశారు. ఈ సంఘటనతో ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


