![]()
-ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ)
కొత్తగూడెం, మన భద్రాద్రి బ్యూరో
మైలారం గుట్ట మైనింగ్ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలంటూ వెళ్లిన ప్రొ. హరగోపాల్, ప్రొ. గడ్డం లక్ష్మణ్, ఇతర నేతలను నాగర్ కర్నూల్ పోలీసులు కస్టడిలోకి తీసుకోవడం హేయమైన చర్య అని, ఈ అక్రమ నిర్బంధాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా కార్యవర్గం తీవ్రంగా ఖండిస్తుందని సోమవారం పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కె. సింధు, జిల్లా ప్రధాన కార్యదర్శి జె. గణేష్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భేషరత్ గా వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతుందని చిలుక పలుకులు పలికి, నేడు అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటంలో గత ప్రభుత్వ వైఖరిని అవలంబిస్తుందని వారు మండిపడ్డారు. పౌర హక్కుల సంఘాల నాయకులను, మేధావులను నిర్బంధించడం ప్రజాస్వామిక పాలన ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. పేద ప్రజల భూములను అన్యాయంగా, అక్రమంగా అభివృద్ధి పేరిట మైనింగ్, ఇండస్ట్రియల్, తదితర అభివృద్ధి పేరుతో ప్రజల జీవనాన్ని ధ్వంసం చేస్తున్నారని, మైలారం గుట్టలను మైనింగ్ పేరుతో అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేయకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వం అక్రమార్కులకు కొమ్మకాయటమే అవుతుందని వారు దుయ్యబట్టారు. తక్షమే మైలారంలో అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, అక్రమంగా అదుపులోకి తీసుకున్న ప్రొ. హరగోపాల్, ప్రొ. గడ్డం లక్ష్మణ్, తదితర నేతలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.


